29 July, 2026 | 10:56 AM

పంజాబ్‌లో ఫైనల్ ఫైట్!

27-05-2024 12:05 AM

జూన్ 1న చివరి విడత పోలింగ్

3 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు

కాంగ్రెస్, ఆప్ మధ్యే ప్రధాన పోటీ

జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్యాములు  

కీలకంగా మారనున్న మాల్వా ప్రాంతం 

ఛండీగఢ్, మే 26: సార్వత్రిక ఎన్నికలు ఫైనల్‌లోకి అడుగుపెట్టాయి. ఏడు విడతల పోలింగ్‌లో చివరి అంకం జూన్ 1వ తేదీన ముగియనుంది. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే అన్ని రాష్ట్రాల్లో పోటీ ప్రత్యర్థి పార్టీల మధ్య జరగుతుండగా.. పంజాబ్‌లో మాత్రం కాస్త విచిత్రమైన పోటీ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఆప్, కాంగ్రెస్ మధ్య అసలు పోటీ ఉంది. విచిత్రం ఏంటంటే జాతీయ స్థాయి లో ఈ రెండు పార్టీలు కూడా ఇండి యా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. కానీ పంజాబ్‌లో మాత్రం ప్రధాని పోటీదారులుగా ఉండి.. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక బీజేపీ కూడా అక్కడక్కడా కాస్త ప్రభావం చూపించినా ప్రధానంగా ఈ ఆప్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. ఇక్కడ 13 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. 

బరిలో నాలుగు పార్టీలు

పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి. ఆప్ ఎన్నికల ప్రచారాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పూర్తిగా తన భుజాలపై వేసుకున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా పంజాబ్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలు రాహు ల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బీజేపీ తరఫున ప్రధాని మోదీ సహా టాప్ లీడర్లు క్యాంపెయిన్ జోరుగా చేస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 8 సీట్లు రాగా, రెండు అకాలీ దళ్, రెండు బీజేపీ, ఒకటి ఆప్ గెలుచుకున్నాయి. 

బీజేపీకి పట్టున్న స్థానాలివే

రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఆప్, కాంగ్రెస్ మధ్య విపరీతమైన పోటీ ఉండగా, బీజేపీకి కూడా పలు స్థానాల్లో ప్రభావం చూ పించనుంది. గురుదాస్‌పూర్, అమృత్‌సర్, హోషియార్‌పూర్, పటియాలాలో బీజేపీకి చెప్పుకోదగ్గ ప్రభావం ఉంది. 2019 ఎన్నికల్లో కమలం పార్టీ గురుదాస్‌పూర్, హోషి యార్‌పూర్‌లో విజయం సాధించింది. ఈ సారి బీజేపీ 13 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా, అమృత్‌సర్ నుంచి మాజీ రాయబారి తరన్‌జిత్ సింగ్‌ను, మాజీ ఎంపీ అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ పటియాలా నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. ఇక, లుధియానా నుంచి రన్‌వీత్ సింగ్ బిట్టు, జలంధర్ నుంచి ఆప్ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ రింకు పోటీలో ఉన్నారు. బిట్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి అమరీందర్ సింగ్ రాజా, ఆప్ నుంచి అశోక్ పరాశర్ పప్పీ బరిలో ఉన్నారు.

మాల్వా బెల్ట్ కీలకం 

పంజాబ్‌ను మాల్వా, మాఝా, దోబా ప్రాంతాలుగా విభజించవచ్చు. సట్లెజ్ నదిపై ప్రాంతాన్ని మాల్వా ప్రాంతమని, బియాస్, సట్లెజ్ నది మధ్య ప్రాంతాన్ని దోబా అని, రావి, బియాస్ నదుల మధ్య ఉన్న ప్రాంతం మాఝా అంటారు. మాల్వా ప్రాంతం ఎప్పటికీ రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటుం ది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పా టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాల్వా ప్రాంతంలో లుధియానా, బటిండా, ఫెరోజ్‌పూర్, ఫరీద్‌కోట్, ఫతేగఢ్ సాహిబ్, పటియాలా, ఆనంద్‌పూర్ సాహిబ్, సంగ్రూ ర్ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక దోబా ప్రాంతంలో హోషియార్‌పూర్, జలంధర్ స్థానాలు వస్తాయి. ఇక మాఝా ప్రాంతంలో గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఖదూర్ సాహిబ్ పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. 

ఇక్కడి వారే సీఎంలు

మాల్వా ప్రాంతానికి చెందిన వారే పంజాబ్ సీఎంలుగా ఎక్కువ మంది పనిచేశారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను, 69 స్థానాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ప్రకాశ్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్, రాజీందర్ కౌర్ భత్తల్, బియాంత్ సింగ్, భగవంత్ మాన్ ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. పైగా 2020 రైతు నిరసనల్లో ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 69 స్థానాల్లో ఆప్ ఏకంగా 66 సీట్లు గెలుచుకుంది. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక, దోబా ప్రాంతంలో ఎక్కువగా దళిత వర్గాలు ఉన్నాయి. పంజాబ్‌లో 32 శాతం దళితుల జనాభా ఉంది.