రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి
మరో 10 మందికి తీవ్ర గాయాలు
ఆగిన ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్
షాజహాన్‌పూర్ (యూపీ), మే 26: ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఖుతర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పూర్ణగిరి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళుతున్న 11 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించారు. రోడ్డు పక్కన తినేందుకు ఆగిన బస్సును చెత్త ట్రక్ అదుపుతప్పి ఢీకొట్టినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ మీనా వెల్లడించారు. ఆ సమయంలో కొంతమంది తినేందుకు దిగగా.. కొందరు బస్సులోనే ఉండటంతో ప్రాణనష్టం జరిగిందని వివరించారు. ప్రమాదం తర్వాత పారిపోయిన ట్రక్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.






