17 April, 2026 | 4:11 AM

ఫేక్ వ్యూస్ వద్దని నిర్ణయించుకున్నా

12-06-2025 12:00 AM

గత కొంతకాలంగా సోషల్‌మీడియాలో అభిమానుల కోసం వ్యూస్ కొని.. మిలియన్ వ్యూస్ వచ్చేలా చేస్తున్నారు నిర్మాతలు. అవి నిజమనుకొని.. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ అభిమానులు కొట్టుకుంటున్నారు. ఇక తాను ఇలాంటివన్నీ చేయనని ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఈ షాకింగ్ నిర్ణయం గురించి బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించారాయన.

ఈ సినిమా నుంచే ఈ పద్ధతికి నాంది పలుకుతున్నట్టు చెప్పారు. తన 22 ఏళ్ల కెరీర్‌లో తొలిసారిగా ‘సినిమా హిట్ అయిన తర్వాత మీరే పిలిచి రెమ్యూనరేషన్ ఇవ్వండి’ అన్న మాటను దర్శకుడు శ్రీరామ్ వేణు చెప్పారని ఆయన తెలిపారు. ‘మీరెంత ఇవ్వాలనుకుంటు న్నారో అంత ఇవ్వండి. పారితోషికం గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు’ అని హీరో నితిన్ అన్నారని చెప్పిన దిల్ రాజు వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.

“దిల్ రాజుకే ఇలా హీరో, డైరెక్టర్ మద్దతిస్తున్నారంటే.. అది ప్రస్తుతం ఇండస్ట్రీకి ఎంత అవసరమో అందరూ ఆలోచించాలి. సినిమా విజయం సాధిస్తే అందరి పారితోషికాలు పెరుగుతాయి. ఫెయిల్యూర్ అయితే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతారు. నిర్మాతకు నటుడు, దర్శకుడు సపోర్ట్ చేయడం కొత్త ఒరవడి” అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. “టీజర్, ట్రైలర్ వ్యూస్ నంబర్లను కొనొద్దని..

ఒరిజినల్ వ్యూస్ మాత్రమే ఉండాలని నా పీఆర్ టీమ్‌కు చెప్పా. ట్రైలర్‌గానీ, ఏదైనా పాటగానీ ప్రేక్షకులకు ఎంతగా చేరువ అయిందో తెలిస్తే.. సినిమా ఎంతగా రీచ్ అవుద్దో అర్థమవుతుంది. డబ్బు పెట్టి.. ప్రచార చిత్రాలకు మిలియన్ వ్యూస్ వచ్చాయని చెబితే అవి ప్రేక్షకుడికి రీచ్ అయ్యాయో లేదో తెలియదు.

ఈ విషయంలోనూ నేను తొలి అడుగు వేశా. కష్టమైనా ముందుకెళ్లాల్సిందే. థియేటర్ల విషయంలో పవన్‌కల్యాణ్ ఏపీలో తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడా పాటిస్తాం. తమ్ముడు సినిమాకు టికెట్ల ధరలు పెంచడంలేదు” అన్నారు.