31-08-2025 07:21:33 PM
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్
చిట్యాల,(విజయక్రాంతి): శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం భూములను అధికారులు పరిరక్షించకపోతే కలెక్టరేట్ ముందు దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆదివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ తెలిపారు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం సర్వే నెంబర్ 201, 201/ప1/1, 201ప/1/2 లలో 102 ఎకరాల దేవాలయ భూమి కలదు. భూమిని పరిరక్షించాలని గత కొన్ని నెలలుగా రెవిన్యూ, దేవాదాయ అధికారులకు జిల్లా కలెక్టర్ కు పలుమార్లు సమస్యను విన్నవించిన జాతీయ రహదారికి ఆనుకొని రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామ పరిధిలోని ఏర్పాటు చేయనున్న కాలుష్య పరిశ్రమ, వెంచర్ నిర్మాణానికి అవసరమైన తారు రోడ్డు మార్గాన్ని 100 ఫీట్ల వెడల్పుతో దేవాలయ భూముల నుండి ప్రైవేటు వ్యక్తులు పనులు చేపట్టడం జరుగుతుంది.
ఇట్టి పనులను తక్షణమే నిలిపివేసి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని, ఆ యొక్క భూమికి నాలుగు వైపులా హద్దులు నిర్ణయించి కంచెను ఏర్పాటు చేయాలని కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పరిరక్షించాలని పలుమార్లు అధికారులకు సమస్యను తెలియజేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దేవాలయ భూములను పరిరక్షించకపోతే త్వరలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దీక్షను చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల దామోదర్, ఎర్పుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.