అక్షరాస్యతతోనే అభివృద్ధి
సమస్త మానవాళికి అక్షరాస్యత, శాంతి, సమర్థవంతమైన సమాజం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1967 నుంచి యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 8న ‘అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం(International Literacy Day)’ జరుపుతున్నారు. ఈ సంవత్సరం యునెస్కో, ఆతిథ్య దేశం మెక్సికో ఆధ్వర్యంలో అందరికీ నాణ్యమైన, సమానమైన విద్య అందించాలనే లక్ష్యంతో 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
అందరికీ అక్షరాస్యత అందించడానికి యునెస్కో తోపాటు ఆయా దేశాలు, స్వచ్ఛంద సంస్థలు శతాబ్దాలుగా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ అనేక దేశాల్లో అందరికీ విద్య అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా విద్య కోసం అత్యధికంగా బడ్జెట్ కేటాయింపులు చేసే దేశంగా అమెరికా నిలిచింది. సుమారు 1.35 బిలియన్ డాలర్లను ఆ దేశం ఖర్చు చేస్తున్నది. అదే సమయంలో దేశ జీడీపీలో అత్యధికంగా 7.5% నిధులు విద్యకు కేటాయించిన దేశంగా స్వీడన్ నిలిచింది. ఇక మన దేశం విషయానికి వస్తే, 2026 బడ్జెట్‌లో విద్య కోసం రూ.1.39 లక్షల కోట్లు కేటాయించింది.
ఇది మొత్తం బడ్జెట్‌లో 2.6 శాతం మాత్రమే. సుమారు 145 కోట్ల మంది ఉన్న మన దేశ జనాభాకు ఈ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యారంగానికి ఖర్చు చేస్తున్న నిధులు జీడీపీలో 4.1% శాతమే. మన పాలకులు 2047 నాటికి వికసిత భారత్ సాధించాలని లక్ష్యంగా ఎంచుకున్నప్పటికీ విద్యకు ఎక్కువ నిధులు కేటాయించకపోవడం శోచనీయం. ఇకనైనా కొఠారి కమిషన్ సూచించిన విధంగా జీడీపీలో కనీసం 6% నిధులు కేటాయించాలని కోరుకుందాం. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, కామన్ స్కూల్ సిస్టం అములు దిశగా ముందుకు సాగాలని ఆశిద్దాం.
ఐ.ప్రసాదరావు, 9390509791
(నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం)
