యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు
గిరిప్రదక్షిణలో పాల్గొన్న వేలాది మంది భక్తులు
యాదగిరిగుట్టకు భారీగా భక్తులు
ప్రత్యేక ఏర్పాటు చేసిన దేవస్థానం అధికారులు
యాదగిరిగుట్ట,(విజయకాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం కొండ కింద గిరిప్రదక్షిణలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఉదయం5 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరసాగింది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swamy Temple) వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం గిరిప్రదక్షిణ కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండ కింద రాజగోపురం వద్ద ఎటు చూసినా వాహనాలతో నిండిపోయింది.
అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు, ధర్మ దర్శన, ప్రత్యేక దర్శన క్యూలైన్ కాంప్లెక్సులు, ప్రసాద విక్రయ క్యూలైన్ కాంప్లెక్స్ పూర్తిగా సందడిగా మారాయి. ధర్మ దర్శనానికి రెండు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. అంగరంగ వైభవంగా స్వామివారి శతకటాభిషేకం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం (108 కలశాలతో అభిషేకం) ప్రధాన ఘట్టం. ముఖ్యంగా స్వాతి నక్షత్రం రోజున లేదా విశేష పర్వదినాలలో అర్చకులు కవచమూర్తులకు పాలు, పెరుగు, పండ్ల రసాలు, శుద్ధ జలాలతో వేదమంత్రాల నడుమ, పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం ఈ అభిషేకం నిర్వహించారు.
యాదగిరి కొండ పైన తిరువీధులలో కొండ కింద రింగురోడ్డులో ఎక్కడ చూసినా జనమే జనం శాస్త్రోక్తంగా నిత్య పూజ్యం, వేకువ జామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పిన అర్చకులు, స్వయంభులకు నిత్య పూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభులకు అభిషేకము, అర్చన ప్రాకారమంటపంలో నృసింహ హోమం,నిత్య కళ్యాణం పర్వాలను వైభవంగా నిర్వహించారు. కొండపైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య పూజలను అర్చక స్వాములు సాంప్రదాయ భద్రంగా జరిపారు. పాత గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవారికి నిత్య పూజలు ఘనంగా చేపట్టారు.




