22 May, 2026 | 1:23 AM

తిరుమలకు పోటెత్తిన భక్తులు

22-05-2026 12:44 AM

రేపటి వరకు క్యూలైన్‌లోకి రావద్దని టీటీడీ సూచన

తిరుమల, మే 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లన్నీ కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండి బాట గంగమ్మ ఆలయం క్యూలైన్ వరక వేచి ఉన్నారు.

ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 గంటల నుంచి 30 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లలోకి ఎక్కువ మంది భక్తులను అనుమతించడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత కూలైన్‌లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. దీంతో భక్తులు వెనుతిరిగి పీఏసీ సముదాయాలకు చేరుకుంటున్నారు. మరో వైపు సీఆర్వో వద్ద వసతి గదుల కోసం భక్తులు బారులు తీరారు. కళ్యాణకట్టకు తలనీలాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్‌లో వేచిఉన్నారు.