17 June, 2026 | 1:52 AM

గుండె పేలిపోతుందే...

17-06-2026 12:49 AM

‘మంగళవారం’ మూవీ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంతో జయకృష్ణ ఘట్టమనేని తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమవుతుండగా, బాలీవుడ్ యువ నటి రాషా తడానీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సీనియర్ నటుడు మోహన్‌బాబు ఈ చిత్రంలో శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. నిర్మాత పీ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు సంగీత ప్రియుల ఆదరణ దక్కింది. తాజాగా చిత్రబృందం మూడో సింగిల్ ‘గుండె పేలిపోతోందే..’ను విడుదల చేసింది. ‘లక్ష పున్నముల వెలుగులు కలిసిన నక్షత్ర కాంతి నా ముందుంటే.. దేవతలందరి దివ్యరూపములు ఒకటై ఇలాగ దర్శనమిస్తే.. ఆకాశమంత అణుబాంబు వచ్చి హఠాత్తుగా నా ముందు పడితే.. పేలిపోతుందే గుండె.. పేలిపోతుందే...’ అంటూ సాగుతోందీ గీతం. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. జూలై 9న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి డీవోపీ: జయకృష్ణ ఐఎస్‌సీ; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుల్లపాటి; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్.