17 June, 2026 | 1:53 AM

సబ్‌కమిటీ నుంచి వాళ్లిద్దరూ తప్పుకోవాలి: నట్టికుమార్

17-06-2026 12:46 AM

‘నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బందులు తలెత్తని రీతిలో అందరికీ ఆమోదయోగ్యమైన పర్సంటేజ్‌ను నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టంచేశారు. ఆయన మంగళవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. సినిమాలలో నష్టం వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేవారు ఎవరూ లేరు. హీరోలు తక్కువ సినిమాలు చేయటం వల్ల ఎగ్జిబిటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలన్నీ సబ్ కమిటీ మీటింగ్‌లో మాట్లాడేందుకు కొందరు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని, ఇబ్బందులు ఎదురుకాకుండా సబ్ కమిటీలో నిర్ణయాలు జరగాలి. సబ్ కమిటీ అధ్యక్షులుగా లీజు ఓనర్స్ అయిన డీ సురేశ్‌బాబు, దిల్ రాజు ఉన్నారు. వారు ఎగ్జిబిటర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అందుకే వారిద్దరూ ఈ కమిటీ నుంచి తప్పుకోవాలి. వారి స్థానాల్లో కేఎల్ నారాయణ, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వంటి వాళ్లను నియమించాలి. నిజమైన బీ ఫారం కలిగిన లైసెన్స్ ఉన్న ఓనర్లు కాకుండా లీజ్ ఓనర్స్ ఇప్పుడు చక్రం తిప్పుతున్నారన్న కలవరం ఎంతోమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఏర్పడుతోంది. ప్రతి ఒక్కరి సమస్యలను సబ్ కమిటీ చర్చించి, శాశ్వతంగా  పరిష్కరించాలి” అన్నారు నట్టి కుమార్.