27 August, 2026 | 2:53 PM

పురోహితులకు పెట్టింది పేరు మంథని.. కోతుల దాడులతో ప్రాణభయం!

27-08-2026 01:20 PM

బయటకు వెళ్లాలన్నా.. ఇంటికి తిరిగి రావాలన్నా భయమే!

కోతుల బెడదతో ప్రజలపై వరుస దాడులు.. చర్యలు ఎప్పుడు?

మంథని, ఆగస్టు 27 (విజయ క్రాంతి): పురోహిత వృత్తికి, వేద సంప్రదాయాలకు పెట్టింది పేరుగా నిలిచిన మంథని పట్టణంలో ఇప్పుడు పురోహితులకే రక్షణ కరువవుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. నిత్యం పూజలు, శుభకార్యాలు నిర్వహించేందుకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ద్విచక్ర వాహనాలపై తిరిగే పురోహితులు కోతుల బెడదతో భయాందోళనకు గురవుతున్నారు.

తాజాగా మంథని పట్టణానికి చెందిన పురోహితుడు బొరగారి రాజు పూజా కార్యక్రమం ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ క్రమంలో ఓ కోతి బైక్ టైర్‌లో ఇరుక్కుపోవడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయిన రాజు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నారు.

అయితే ఇది ఒక్క రాజుకే జరిగిన ఘటన కాదని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు పట్టణవాసులు కోతుల దాడులకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయని, పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని వాపోతున్నారు. పురోహితులకు పెట్టింది పేరైన మంథనిలో, పూజకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరతాడో లేదో అనే పరిస్థితి రావడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వాటి నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.