28 July, 2026 | 6:45 PM

పేపర్ లీక్ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. రూ.10 కోట్ల జరిమానా

28-07-2026 05:56 PM

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ విషయం తెలియగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు, 2026 నిదర్శనం అని, ఈ బిల్లు భారత పార్లమెంట్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తెలిపారు. గతంలో ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయని, 2009, 2011 లోనూ ఎన్నో పేపర్లు లీకేజీలయ్యాయని, 2012 లో ఎయిమ్స్ ఎంట్రన్స్ పేపర్ లీకేజీ జరిగిందని కేంద్రమంత్రి వెల్లడించారు.

2010 ఉత్తర్ ప్రదేశ్ లో బీఈడీ పేపర్, గతంలో తమిళనాడు పీఎస్సీ పేపర్ లీకేజీలు క్రమంగా వ్యవస్థాగత నేరాలు గా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో ఎంట్రన్స్ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు లీక్ అయ్యాయి. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు 1992, 2010లో కొన్ని ప్రయత్నాలు జరిగాయని, ఆ ప్రయత్నాలు ఎందుకు పూర్తి కాలేదో ఆనాటి పాలకులు చెప్పాలని జితేంద్రసింగ్ డిమాండ్ చేశారు. లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించేందుకు బిల్లులో నిబంధనలు రూపొందించామని, దోషులకు పదేళ్ల జైలుశిక్ష, రూ.కోటి నుంచి రూ.10 కోట్ల జరిమానా పెంచామని తెలిపారు.  పేపర్ లీకేజీ కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.