'ఖేలో ఇండియా సంసద్'లో డీకే అరుణ, పీవీ సింధు సందడి
నందిగామ, ఆగస్టు 27 (విజయక్రాంతి): యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కేలో ఇండియా సంసద్ కార్యక్రమం(Khelo India Sansad Programme) గురువారం నందిగామ మండల పరిధిలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ(Mahabubnagar MP DK Aruna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు(Badminton players) పీవీ సింధు(PV Sindhu), ముస్కాన్ ఖాన్ పాటు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా క్రీడల ప్రాధాన్యత, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడం వంటి అంశాలపై చర్చించారు.
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా అవసరమైన వేదికలు, అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకతను నాయకులు వివరించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందిస్తాయని, ప్రతిభ ఉన్న క్రీడాకారులను చిన్న వయస్సు నుంచే గుర్తించి ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణులు పీవీ సింధు, ముస్కాన్ ఖాన్(Muskan Khan) పాల్గొనడంతో విద్యార్థులు, యువతలో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది. క్రీడల పట్ల యువత మరింత ఆసక్తి పెంచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు






