ఓటర్ల జాబితా సవరణలో తప్పులకు తావివ్వొద్దు.!
నాగర్ కర్నూల్, ఆగస్టు 25 ( విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసి, అర్హులైన ఓటర్ల వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దముద్దునూరు మండల కేంద్రంలోని 179వ పోలింగ్ బూత్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎస్‌ఐఆర్‌లో నమోదైన అనామాలిస్, నో మ్యాపింగ్ వివరాలను బీఎల్‌ఓ జ్యోతిని అడిగి తెలుసుకున్నారు.
అనామాలిస్‌కు సంబంధించి 160 మందికి, నో మ్యాపింగ్‌కు సంబంధించి ఏడుగురికి నోటీసులు జారీ చేసినట్లు బీఎల్‌ఓ వివరించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు జనన, ఎస్‌ఎస్‌సీ తదితర ధ్రువపత్రాలను సమర్పించి వివరాలను సరిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నోటీసుదారునికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రేవంత్ చంద్ర, ఆర్‌ఐ ఎం.డి. మాసూం, బీఎల్‌ఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.






