8 July, 2026 | 5:04 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు

08-07-2026 04:07 PM

పుష్కరాల కవర్లకు దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదు

ప్రభుత్వ కార్యక్రమాలను ఆలయానికి అంటగట్టడం దురుద్దేశం

భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలి

ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తల మండలి ఘాటు కౌంటర్

మహాదేవపూర్/కాళేశ్వరం,(విజయక్రాంతి): మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు, నిరాధారాలు, రాజకీయ ప్రేరేపితమైనవని ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తల మండలి తీవ్రంగా ఖండించింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన దక్షిణకాశీ కాళేశ్వరాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం దురదృష్టకరమని పేర్కొంది. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఆలయం తరఫున ఎలాంటి చీరల కిట్లు, కవర్లు పంపిణీ చేయలేదని స్పష్టం చేసింది.

ప్రభుత్వం తరఫున నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన కవర్లు, వస్త్రాలను దేవస్థానానికి అంటగట్టడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పేర్కొంది. మేము ఆలయం తరఫున కవర్లు ముద్రించి ఉంటే వాటిపై ప్రభుత్వం ఫోటోలు, ఐటీ మంత్రి ఫోటోలు ఎందుకు ఉంటాయి. ఆలయ కార్యక్రమమైతే స్వామివారి చిత్రం, దేవస్థానం పేరు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను కూడా దేవస్థానంపైకి నెట్టివేసి ప్రజల్లో అనుమానాలు సృష్టించడం వెనుక రాజకీయ ఉద్దేశం తప్ప మరొకటి లేదన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలపై ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే ప్రభుత్వాన్ని అడగాలని, కానీ ప్రతి విషయాన్నీ ఆలయానికి ముడిపెట్టి పవిత్ర క్షేత్ర ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదన్నారు.కాళేశ్వరం ఆలయం ఏ ఒక్క వ్యక్తి లేదా రాజకీయ పార్టీకి చెందినది కాదని, కోట్లాది మంది హిందూ భక్తుల ఆరాధ్య దైవమని గుర్తుచేశారు. అలాంటి పవిత్ర దేవస్థానంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.పుష్కరాల సందర్భంగా కాశీ నుంచి వేదపండితులను ఆహ్వానించడాన్ని కూడా విమర్శించడం విచారకరమన్నారు.

కాశీ గంగా హారతి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన సంప్రదాయమని, కాశీ వెళ్లే అవకాశం లేని లక్షలాది మంది భక్తులు కాళేశ్వరంలోనే ఆ అనుభూతిని పొందాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. దీనివల్ల స్థానిక బ్రాహ్మణ పండితులను ఎక్కడా అవమానించలేదని, స్థానిక అర్చకులు, వేదపండితుల సమక్షంలోనే అన్ని కార్యక్రమాలు జరిగాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం, మంథనిలో బ్రాహ్మణులు లేరా అని ప్రశ్నించడం ద్వారా స్థానిక వేదపండితులనే అవమానించినట్లైందని అన్నారు.

మీరు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు నిర్వహించారు. అప్పట్లో కాశీ సంప్రదాయాన్ని ఎందుకు తీసుకురాలేదు. ఇప్పుడు భక్తుల కోసం కొత్త ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వాటిని ఎందుకు విమర్శిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రోత్సహించాల్సింది పోయి రాజకీయ రంగు పులమడం సమంజసం కాదన్నారు. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసినప్పుడు  విమర్శించామా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా యాదాద్రి అభివృద్ధిని స్వాగతించారని గుర్తు చేశారు.

అలాగే బాసర, వేములవాడ, భద్రాచలం వంటి దేవాలయాలు కూడా ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చెందుతున్నాయని, అక్కడ ఎవరూ దేవాలయాలను రాజకీయాలకు వాడుకోలేదని  చేయలేదన్నారు.అయితే కాళేశ్వరం విషయంలో మాత్రమే పదేపదే ఆరోపణలు చేస్తూ ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశం ఏమిటో పుట్ట మధుకర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.సమాచార హక్కు చట్టం పేరుతో కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. చట్టపరంగా అధికారులు ఇచ్చే సమాధానాలకు దేవస్థానాన్ని బాధ్యులను చేయడం సరైంది కాదన్నారు. చట్టం తన పని చేస్తుంది, అధికారులు వారి విధులు నిర్వర్తిస్తారు. ప్రతి అంశాన్ని ఆలయానికి అంటగట్టడం కేవలం రాజకీయ ప్రచారమేనని విమర్శించారు.

కాళేశ్వరం ఆలయం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, పుష్కరాల నిర్వహణ వంటి అంశాల్లో దేవాదాయ శాఖ, ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ఆలయ ప్రతిష్ఠకు మాత్రమే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల కోసం పనిచేసే పవిత్ర దేవస్థానాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవద్దని, భక్తుల విశ్వాసాలను గౌరవించాలని పుట్ట మధుకర్‌కు సూచించారు. కాళేశ్వరం దక్షిణకాశీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పుణ్యక్షేత్రమని, ఈ పవిత్ర క్షేత్రాన్ని వివాదాల్లోకి లాగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తల మండలి విజ్ఞప్తి చేసింది.