ఇరాన్‌పై అమెరికా దాడులు.. సమర్థించుకున్న ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో మళ్లీ నెలకున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) స్పందించారు. ఇరాన్ పై అమెరికా దాడులను ట్రంప్ సమర్థించారు. అమెరికా సైనిక చర్యల వల్లే సుదీర్ఘ ఘర్షణలు తప్పాయని వ్యాఖ్యానించారు. దాడులు చేసే సత్తా ఇరాన్ కు ఇంకా ఉందని ట్రంప్ అంగీకరించారు. డొనాల్డ్ ట్రంప్ మీడియాతో ఇలా అన్నారు. "నిన్న వారు మనపై దాడి చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. వాస్తవానికి వారు నాలుగు దాడులు చేశారు. మనం వాటిలో మూడింటిని అడ్డుకున్నాం, కానీ ఒకటి ఒక నౌకను తాకింది. అది మిత్రదేశానికి చెందిన నౌక కాకపోయినప్పటికీ, అది ఒక నౌక—అదీ చాలా ఖరీదైన నౌక. పెద్ద ప్రమాదమేమీ జరగలేదు కానీ, దానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది. వారు అలా చేసి ఉండకూడదు. కాబట్టి, దీనికి సంబంధించిన విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది." అని ట్రంప్ పేర్కొన్నారు.
హార్ముజ్ జలసంధిలో(Strait of Hormuz) ఒక సరుకు రవాణా నౌకపై దాడి జరిగిన అనంతరం, అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులు డ్రోన్, క్షిపణి నిల్వ స్థావరాలతో పాటు రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించిన దానికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ జరిగిందని ఒక సీనియర్ అమెరికా అధికారి తెలిపారు. ఇరాన్ ఉద్రిక్తతలను పెంచితే మళ్లీ దాడి చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని, టెహ్రాన్‌కు ఒక సందేశం పంపడానికే ఈ దాడులు జరిగాయని అధికారులు చెబుతున్నారు.
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి
అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేసిన ఇరాన్ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు పంపింది. ఈసారిక అమెరికా భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ఈసారి యుద్దంలో కొత్త సామర్థ్యాలను ప్రవేశపెడతామని బెదిరించింది. శత్రువు పొరపాటు చేస్తే తదుపరి యుద్ధం గతంలో జరిగిన దానిలా ఉండబోదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలని ఇరాన్ ఆర్మీ సలహాదారు మొహ్సేన్ రెజాయ్(Mohsen Rezaee) తేల్చిచెప్పారు. అటు భద్రత కోసం అమెరికా పై ఆధారపడవద్దని గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలను హెచ్చరించారు. ఈ ప్రాంతీయ భద్రతకు ఉన్న ఏకైక నమ్మకమైన మార్గం అమెరికాకు దూరంగా ఉండటమేనని హితవు పలికారు.






