అంకిత్ హాస్పిటల్స్పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: ఎండీ డా. అనురాధ
మానకొండూరు,(విజయక్రాంతి): పేదలు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే సేవాభావంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న అంకిత్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి(Ankit Multi Specialty Hospital)పై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా. కవ్వంపల్లి అనురాధ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మానకొండూరు మండల కేంద్రంలో ఇటీవల నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు(Cancer diagnostic tests) చేయించుకున్న మహిళలకు శనివారం రిపోర్టులను అందజేసి, వైద్యపరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డా. అనురాధ మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాల(Free medical camp) పేరుతో రోగులను తమ ఆసుపత్రికి రప్పించుకోవాలనే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి, అవసరమైన సమయంలో సరైన చికిత్స పొందేలా అవగాహన కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అయితే, ఉచిత వైద్య శిబిరాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. శిబిరాల ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని సదుపాయాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స, వైద్య సేవలు అందేలా మార్గనిర్దేశం చేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఆసుపత్రి సేవలను రాజకీయాలకు వేదికగా మార్చి లబ్ధి పొందాలని చూడటం సరికాదన్నారు. సుమారు పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఎల్వోసీ అంటే ఏమిటో, దాని ద్వారా ఏ ఆసుపత్రిలో చికిత్స, వైద్య సేవలు పొందవచ్చో తెలియకపోవడం శోచనీయమని డా. అనురాధ వ్యాఖ్యానించారు. గత నెల 23న ఎం ఎన్ జే , అంకిత్ హాస్పిటల్స్ సయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో సుమారు 500 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. పరీక్షల్లో కొంతమందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య చికిత్స పొందే అవకాశం ఉందని, అర్హులైన వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా. అనురాధ సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, ప్యాక్స్ చైర్మన్లు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, నాగిశెట్టి రాజయ్య, గంగుల రామిరెడ్డి, రొంటాల లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు మర్రి ఓదెలు యాదవ్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, తిరుమల రెడ్డి,బుర్ర శ్రీధర్ గౌడ్, మడుపు ప్రేమ్ కుమార్, కోండ్ర సురేష్, రేవెల్లి రాజలింగం,కనకం అశోక్, గొల్లెన కొమురయ్య, ఎన్ బాపురావు, బాకారపు సమ్మయ్య, ఎడ్ల శ్రీధర్, బుర్ర శ్రీకాంతు, దూలం దేవేంద్ర, దూలం వీరస్వామి, ఎర్రోళ్ల కవిత, రాజేశం తదితరులు పాల్గొన్నారు .