అభివృద్ధి పేరుతో అన్యాయం చేయొద్దు
తుర్కయంజాల్, మార్చి 12: జీహెచ్‌ఎంసీ ఆదిభట్ల తొర్రూరు డివిజన్ పరిధి కోహెడలో అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవడం సరైనది కాదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. భూములు నష్టపోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి, రైతులతో కలిసి ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న
భూములను బూర నర్సయ్యగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎస్సీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం దారుణమన్నారు. సర్కార్ చర్యలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. భూములనే నమ్ముకొని, సాగుపైనే ఆధారపడి బతుకుతున్న రైతుల కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలకు తాము వ్యతిరేకం కాదని..
కానీ అభివృద్ధి పేరుతో రైతులకు అన్యాయం చేయడం సరికాదని బూర హితవు పలికారు. ప్రభుత్వం రైతులకు వెంటనే నష్టపరిహారంతో పాటు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు రైతులకు బీజేపీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని నర్సయ్యగౌడ్ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కొత్త రాంరెడ్డి, బచ్చిగళ్ల రమేష్, కొండ్రు పురుషోత్తం, కందాల బలదేవరెడ్డి, కరాడి శ్రీలత అనిల్కుమార్, భిక్షపతి, యూసుఫ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




