వయోవృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : వయోవృద్ధులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య (Additional Collector P. Chandraiah)అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ.
జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి, వయోవృద్ధుల సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.
వయోవృద్ధుల అనుభవం, వారి సలహాలు, సూచనలు సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. తల్లిదండ్రులు తమ ఆస్తులు, భూములను పిల్లలకు బదలాయించిన అనంతరం నిర్లక్ష్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆస్తిపాస్తులు లేని వయోవృద్ధులను వారి పిల్లలు బాధ్యతగా చూసుకోవాలని తెలిపారు. వయోవృద్ధులు సమాజానికి విలువైన సంపద అని, కుటుంబానికి పెద్దలుగా వారు అందించే అనుభవం సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
వయోవృద్ధుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత ముఖ్యమని, వయోవృద్ధులు క్రమం తప్పకుండా నడక, యోగా వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలను కొనసాగించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాల ద్వారా వయోవృద్ధులకు రక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు.
రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో చట్టాన్ని అమలు చేయడం, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సుమారు 35 వేల 250 మంది వయోవృద్ధులు వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారని, ప్రతి నెలా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులు గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వయోవృద్ధుల హక్కులు, సంక్షేమంపై సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు.
వయోవృద్ధులు బదలాయించిన ఆస్తికి సంబంధించిన పరిస్థితులలో తగిన సందర్భాలలో ఆర్.డి.ఓ. కు బదలాయింపును రద్దు చేసే అధికారం ఉంటుందని వివరించారు. సెక్షన్ 24 ప్రకారం వయోవృద్ధులను, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు, జరిమానా వంటి నిబంధనలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, నిబంధనల ప్రకారం వారి జీతం నుంచి తల్లిదండ్రుల పోషణకు చెల్లింపులు చేయించే అవకాశం ఉన్నాయని తెలిపారు.
చట్టంలోని నిబంధనలను పాటించని వారికి జరిమానా, శిక్ష వంటి చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి మంగళవారం డే కేర్ సెంటర్లలో వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వయోవృద్ధుల సమస్యలు, సహాయం కోసం 14567 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం వయోవృద్ధులను సన్మానించారు.