22 August, 2026 | 5:00 PM

కరెంటు స్తంభమా..? కాలకూట ప్రమాదమా..!

22-08-2026 03:57 PM

కళ్లెదుటే మృత్యు ఘంటిక.. సాలీడు గూడు లా అల్లుకున్న వైర్లు!

తెగిపడితే ప్రాణాల బాధ్యత ఎవరిది..? కరెంటోళ్లకు కనిపించవా ఈ ప్రమాదం!

రామాయంపేట,ఆగస్టు 22 (విజయక్రాంతి): ప్రజల ఇళ్లకు వెలుగులు పంచాల్సిన విద్యుత్‌ స్తంభాలు.. ఇప్పుడు భయానికి ప్రతీకలుగా మారుతున్నాయా..? విద్యుత్‌ తీగలు సాలీడు గూళ్లలా అల్లుకుపోయి, ఎప్పుడు ఏ తీగ తెగిపడి ఏ ప్రాణాన్ని బలితీసుకుంటుందో తెలియని దుస్థితి నెలకొంది. కళ్లెదుటే ప్రమాదం కనిపిస్తున్నా.. విద్యుత్‌ శాఖ అధికారుల కళ్లకు మాత్రం కనిపించకపోవడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.

ఒక్కసారి గాలి బలంగా వీచినా.. చిన్న వర్షం పడినా.. ఈ తీగల పరిస్థితి చూస్తే గుండెల్లో గుబులు పుడుతోంది. ఎక్కడ తీగ తెగిపడుతుందో.. ఎప్పుడు షార్ట్‌సర్క్యూట్‌ జరుగుతుందో.. ఎవరి ప్రాణం ప్రమాదంలో పడుతుందోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. వెలుగులు ఇవ్వాల్సిన విద్యుత్‌ వ్యవస్థ.. మృత్యువుకు ఉచ్చులా మారితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజల ప్రాణాలకు విలువ లేదా..? ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొనాల్సిన అవసరం లేదా..? విద్యుత్‌ స్తంభాల చుట్టూ, ఇళ్ల ముందు, ప్రధాన రహదారుల వెంట అస్తవ్యస్తంగా వేలాడుతున్న తీగలను చూసి స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా తీగ తెగిపడి విద్యుత్‌ సరఫరా జరిగితే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తోంది.

ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు పరుగులు తీయడం కాదు.. ప్రమాదానికి ముందే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత విద్యుత్‌ శాఖపై ఉంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్‌ తీగలను సరిచేయాలి. ప్రమాదకరంగా మారిన స్తంభాలను మార్చాలి. వేలాడుతున్న తీగలను క్రమబద్ధీకరించాలి. ముఖ్యంగా ప్రజల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలి. లేకపోతే.. ఈ నిర్లక్ష్యం ఎప్పుడో ఒకరోజు ఓ ఇంట్లో విషాద దీపం వెలిగించే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు. కరెంటు స్తంభాలు వెలుగుల కోసం.. మృత్యు ఘంటికల కోసం కాదు!