విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంచాలి
డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రియాంక
సిరికొండలో ఘనంగా వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు
సిరికొండ,(విజయ క్రాంతి): భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాలంటే విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (డీఎఫ్‌ఆర్‌ఓ) ప్రియాంక పిలుపునిచ్చారు. ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం సిరికొండ అటవీ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవులు ప్రకృతికి ఊపిరితిత్తుల వంటివని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.
విద్యార్థి దశ నుంచే ప్రకృతి పట్ల ప్రేమను, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అనంతరం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ సర్పంచ్ బొడ్డు దత్తు, ఉప సర్పంచ్ తోకల రాజు, మండల అధ్యక్షుడు షేక్ ఇమామ్, మైనారిటీ చైర్మన్ ఎండీ రంజాన్, కంచం లక్ష్మణ్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






