calender_icon.png 4 February, 2026 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్వర్డ్, అంతరిక్షం వెళ్లినా.. నీ చెత్త బుద్ధి మారదు

05-02-2026 12:00:00 AM

  1. తెలంగాణకు కేసీఆర్ జాతిపిత

ఆంధ్ర పాలకుల బూట్లు తూడుస్తుంటే ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది?

సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం 

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు  మండిపడ్డారు. రావి నారాయణరెడ్డి జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హేట్ స్పీచ్‌పై హిత బోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు.  హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారని విమర్శించారు. ‘ నువ్వు అమెరికాలోని హార్వర్డ్ వెళ్లినా, అంతరిక్షం వెళ్లినా నీ చెత్త బుద్ధి మారదు, నోటి మురికి పోదు అన్నది సుస్పష్టమైంది ’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదని, రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలన్నారు.  అమెరికా వెళ్లి హార్వర్డ్‌లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోదన్నారు. రేవంత్‌రెడ్డికి  కనీస సంస్కారం రాలేదు. చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అని అన్నారు.

దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతి పితనే అని హరీశ్‌రావు పేర్కొన్నారు.  నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ర్టం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది..? అని ఆయన సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా..? ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్‌రెడ్డి  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.