04-02-2026 02:24:34 AM
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాటీల్లో టికెట్ దక్కలేదని అసంతృప్తి
కామారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గీయులకు షాక్
ఒక్కరు కూడా టికెట్‌కు నోచుకోని వైనం
కామారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తల నొప్పిగా మారాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ దక్కలేదని కొం దరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసం హరణకు చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో టికెట్ దక్కని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్‌లో వర్గపోరుతో పలువురు నాయకుల అ నుచరులకు టికెట్లు గల్లంతయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో షబ్బిలి అనుచరులకు కొందరికి టికెట్లు గల్లంతయ్యాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు కొందరికి చుక్కెదురయింది.
ఇరువర్గాల అనుచరులు టికెట్ల కోసం చక్క ర్లు కొట్టినా, ఇద్దరి నాయకుల మధ్య సయో ధ్య కుదుర్చేందుకు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఇరువురికి సమానంగా టికెట్లు కేటాయించడంతో ఇరువురికి చెందిన అనుచరులకు అందరికీ టికె ట్లు దక్కలేదు. దీంతో కొందరు నారాజ్‌లో ఉన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్లు రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుచరులకు దక్కాయి. నియోజకవర్గ ఇ న్చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులకు ఒక్కరికి కూడా టికెట్ లభించలేదు. దీంతో ఆయన అనుచరులు అసంతృప్తిలో ఉన్నారు. ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్‌మోహన్ అనుకున్న వారికి టికెట్లు దక్కాయి. బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అనుకున్న వారికే టికెట్లు దక్కాయి.
బీసీ మహిళకు అన్యాయం చేశారు
జిన్నారం(అమీన్పూర్): బీసీ మహిళా అని కూడా చూడకుండా కాంగ్రెస్ పార్టీ నా యకులు డబ్బులకు తలొగ్గి టికెట్టు అమ్ముకున్నారంటూ సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన నీలం శ్రీలత ముదిరాజ్ ఆరోపించారు. 4వ వార్డు నుంచి టికెట్టు ఆశించిన శ్రీలతకు కాకుండా మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి డబ్బులకు లొంగి అధిష్టానం అనుమతి లేకుండానే మరొకరికి టికెట్ కేటాయించారని ఆరోపిస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా అన్యా యం చేశారని వాపోయారు. తనకు అన్యా యం చేసిన వారు నాశనమై పోతారని దుమ్మెత్తిపోశారు. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
నా భర్త ఆరోగ్యం బాగాలేకున్నా కనికరించరా?
వనపర్తి(విజయక్రాంతి): వనపర్తిలో తన తాళి బొట్టును చూపిస్తూ 1వ వార్డుకు నామినేషన్ వేసిన అభ్యర్థి లక్ష్మి తన కుమారుడు అక్షయ్‌లతో కలిసి జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో బోరున విలపించింది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, పార్టీ బలోపేతానికి అహర్నిశలు తన భర్త రాగి వేణు కృషి చేశారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేక చావు బతుకుల మధ్య ఉంటే కూడా పార్టీకి కనికరం లేకుండా తమ కుటుంబానికి రావాల్సిన పార్టీ టికెట్ ఇతరులకు ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
తమకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నందుకే మోసం చేస్తారా అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిలను ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన వారికి పార్టీ టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకుని ఉన్న వారికి మాత్రం మొండి చెయ్యి ఏమిటని నిలదీశారు. చివరికి పార్టీ పెద్దలు బుజ్జగించడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.
బురఖా వేసుకుని నామినేషన్ ఉపసంహరణ
కోదాడ: కోదాడ మునిసిపాలిటీ 11వ వార్డులో నామినేషన్ ఉపసంహరణ సంఘటన ఆసక్తికరంగా మారింది. 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున దేవరపల్లి మల్లేశ్వరి బరిలో నిలవగా ఏకగ్రీవంగా కోసం వార్డు నాయకులు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన దొడ్డిగర్ల గీత నామినేషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన నామినేషన్ ఉపసంహ రించుకునేందుకు బురఖా ధరించి మున్సిపల్ ఆఫీసుకు వచ్చి, నిబంధనల ప్రకారం నామినేషన్ ఉపంసహరించుకున్నారు.
ఎవరి కంట పడుకుండా ఉండేందుకు, తన ఇష్టానికి వ్యతిరేకంగా బరిలో ఉండాలని ఒత్తిడి చేసేవారి నుంచి తప్పించుకునేందుకు బురఖా ధరించి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే గీత నామినేషన్ ఉపసంహరించుకోవడంతో 11వ వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దేవరపల్లి మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రూ.14 లక్షలకు టికెట్ అమ్ముకున్నారు!
వరంగల్(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్నికల తో తీవ్ర ఇబ్బంది నెలకొంది. మహబూబాబాద్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ సిట్టింగ్ కౌన్సిలర్‌గా ఉన్న తనకే మళ్లీ టికెట్ ఇస్తామని నమ్మించి, నామినేషన్ కూడా వేయిం చి, చివరి క్షణంలో తనకు బీఫామ్ ఇవ్వకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తి నుంచి రూ.14 లక్షలు తీసుకొని బీఫామ్ ఇచ్చి డీసీ సీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ, ఎమ్మె ల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ మోసం చేశారని బి వెంకన్న ఆరోపించారు. ఇదే మున్సిపాలిటీలో సీపీఐతో పొత్తు ఉంటుందని నమ్మించి, ఐదు కౌన్సిలర్ సీట్లు ఇస్తా మని, తర్వాత నాలుగు ఇస్తామని, చివరకు ఒక్కటి కూడా ఇవ్వకుండా తమ పార్టీకి చెం దిన వ్యక్తి చేత కాంగ్రెస్ పార్టీ పేరుతో నామినేషన్ వేయించి నమ్మించి గొంతు కోశారని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి ఆరోపించారు. తమ సిట్టింగు స్థానాలను కూడా తమకు ఇవ్వకుండా మొండి చేయి చూపిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. అయితే ఇక్కడ సీపీఐకి బదులు సీపీ ఎంకు నాలుగు సీట్లను కేటాయించడం విశే షం. జనగామ మున్సిపాలిటీలో 11వ వార్డు లో పొత్తు పేరుతో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సీటును సీపీఐకి కేటాయించడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నేత కొమ్మూరి ఇంటి ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఆమనగల్లులో బీఆర్‌ఎస్ నేతల రచ్చ కుర్చీలు విరగ్గొట్టిన అసమ్మతి నేతలు!
ఆమనగల్లు(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలోని 15 వార్డులకు సంబంధించి బీ-ఫారాల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించగా రసాభాసగా మారింది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే, 14వ వార్డు అభ్యర్థిగా వస్పుల సాయిలు పేరును ప్రకటించడంతో వివాదం మొదలైంది. టికెట్ ఆశించిన వస్పుల సుగుణ అనుచరులు వేదికపైకి దూసుకెళ్లారు. ‘నెల రోజులుగా ప్రచారం చేసుకుంటుంటే, ఇప్పుడు మరొకరికి టికెట్ ఎలా ఇస్తారు?‘ అంటూ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను నిలదీశారు. మాట మాట పెరగడంతో ఆగ్రహించిన కార్యకర్తలు ఫంక్షన్ హాల్‌లోని కుర్చీలను విరగ్గొట్టి నిరసనను వ్యక్తం చేశారు. నేతల మధ్య వాగ్వాదంతో కాసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పోటాపోటీ నిరసనలు, వాగ్వాదాల మధ్యే మాజీ ఎమ్మెల్యే మిగిలిన అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ’రెబల్స్’గా బరిలోకి దిగితే ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కరసేవ చేసినా టికెట్ దక్కలేదు
కేసముద్రం(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కరుడుగట్టిన బీజేపీ నాయకుడిగా, కరసేవకు వెళ్లి బీజేపీ బాలు నాయక్ అనే విధంగా పేరు గడించినా తనకు పార్టీ టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపిందని కేసముద్రం మున్సిపాలిటీ 14వ వార్డుకు పోటీ పడుతున్న భూక్యా బాలు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన బాల్య దశ నుంచి బీజేపీ పట్ల విధేయత చూపుతూ, పార్టీని నమ్ముకుని జీవిస్తున్న తనకు అవకాశం కల్పించ లేదని వాపోయారు. 40 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేస్తున్న తనలాంటి వారికి అవకాశం వచ్చినప్పుడు పోటీ చేయడానికి టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటుకుంటానని బాలు నాయక్ వెల్లడించారు.