అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
మణుగూరు, సెప్టెంబర్ 16, (విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని పినపాక నియోజకవర్గ ఈఆర్‌ఓ, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అధికారులను ఆదేశించారు. మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీలోని ఓటర్ల నమోదు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు.
అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో అధికారులతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, అనర్హుల పేర్లు జాబితాలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లకు నోటీసుల జారీ, పంపిణీ, విచారణలు, పెండింగ్ కేసులు, ధ్రువపత్రాల పరిశీలనపై సమీక్షించారు.
నోటీసు అందజేసిన వివరాలను బీఎల్‌ఓలు తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పినపాక నియోజకవర్గంలో విచారణకు పిలిచిన 434 మందిలో సుమారు 60 శాతం మంది హాజరవుతున్నారని తెలిపారు. హాజరవుతున్న వారిలో 30 నుంచి 40 శాతం మంది సరైన ధ్రువపత్రాలు లేకుండా వస్తున్నట్లు పేర్కొన్నారు.
విచారణకు ముందుగానే అవసరమైన ధ్రువపత్రాల వివరాలను ఓటర్లకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఇంటినీ సందర్శించి ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పుట్టిన తేదీ, వయస్సు తదితర వివరాల నిర్ధారణకు ఎన్నికల సంఘం సూచించిన పత్రాలను సమర్పించేలా చూడాలన్నారు.
వివరాల్లో వ్యత్యాసాలు ఉంటే నిబంధనల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన, పంచనామా చేపట్టాలని సూచించారు. ఓటర్ల తొలగింపు ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని రాహుల్ తెలిపారు. ఈ సమావేశంలో తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.