13 April, 2026 | 1:54 AM

రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

13-04-2026 12:00 AM

ఆరు రోజులపాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు..

రేపటి నుంచి 18వతేదీ వరకు నిరంతర అవగాహన 

కార్యక్రమాలు... 

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి చేపట్టిన అరైవ్ అలైవ్ 2026 కార్యక్రమాన్ని ఈ నెల 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని, ప్రతి పౌరుడు బాధ్యతతో ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన అన్నారు. అరైవ్ అలైవ్ అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అన్ని శాఖల సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు.

కార్యక్రమాల వివరాలు 

13న సోమవారం జిల్లాలోని అన్ని గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 14న మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి సంబంధిత శాఖలతో కలిసి మరమ్మత్తు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. 15న బుధవారం పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, బస్సు డ్రైవర్లకు ప్రత్యేక సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

16న గురువారం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వారి లైసెన్సులు, యూనిఫామ్ తదితర అంశాలపై తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు.17న శుక్రవారం ప్రమాద స్థలంలో ఇవ్వాల్సిన ప్రథమ చికిత్స, స్పందించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.18న శనివారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించడం, వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని, ఇలా జిల్లా వ్యాప్తంగా ఆరు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు ప్రజలు, యువత, వాహనదారులు సహకరించి విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు.