20-02-2026 12:00:00 AM
సిద్ధగౌని సుదర్శన్ :
హైదరాబాద్‌లో ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల తీరు రోజు రోజుకు అధ్వానంగా తయారవుతున్నది. ప్రజల జీవితాలు, వారి ఆరోగ్యాలతో ఆటాడుకుంటున్నాయి. అధిక ఫీజులు, నకిలీ డాక్టర్లు, అనుమతులు లేని ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వ్యాపార లాభాలను కాపాడుకునే దిశగా సాగుతున్నాయి.
రాష్ర్టంలో కేవలం ఒక్క హైదరాబాద్ జిల్లా లో, 2,367 ప్రైవేట్ ఆస్పత్రులు, క్లీనిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 276 ఆసుపత్రులు ప్రభు త్వ అనుమతులు లేకుండా నడుస్తున్నా యి. దీన్నిబట్టి పరిస్థితి తీవ్రత ఎంత ఉందనేది అర్థం చేసుకోవచ్చు.
ప్రజల ప్రాణాల తో చెలగాటమాడే నకిలీ డాక్టర్లను ఏరివేసేందుకు అధికారులు ప్రస్తుతం వైద్యుల సర్టిఫికేట్లను, లైసెన్సులను నిశితంగా పరిశీలిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వందలాది మంది నకిలీ డాక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదైన నేపథ్యంలో నగరంలో జరుగుతున్న తాజా తనిఖీలు వైద్య రంగంలో కల కలం రేపుతున్నాయి.
హైదరాబాద్, మేడ్చ ల్ జిల్లాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న 250 ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝుళిపించేందుకు వైద్యా రోగ్య శాఖ సిద్ధమైంది. ఆయా ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. గత ఆరు నెలలుగా చేపట్టిన సర్వేలో ప్రైవేటు ఆసుపత్రుల అక్రమాలు చాలానే వెలుగుచూశాయి. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు మూడు రోజుల గడువునిచ్చిన అధికారులు అప్పటివరకు ఆయా ఆసుపత్రుల్లో వైద్య, ఇతర కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.
కఠిన చర్యలేవి?
నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉం డాల్సిన ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండానే వైద్య సేవలు నిర్వహిస్తున్న దాదాపు 250 ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. వీటిలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 224 ఆసుపత్రులు ఉండగా.. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మరో 26 ఆసుపత్రులు ఉన్నాయి.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా నకిలీ డాక్టర్లు, అనధికార హాస్పిటల్స్‌ను గుర్తించేందుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ద్వారా నకిలీ భాగో తం, వాటి వెనుక జరుగుతున్న అక్రమాలు వెలుగుచూశాయి. కాగా పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నవారు నిబంధనల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాల్సిన అవసరముందని హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్ వో తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమ తి, చట్టపరమైన రిజిస్ట్రేషన్లు లేకుండా ఆసుపత్రులను నడపడం సరికాదని పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న ఆసుపత్రు లు తమ వద్ద ఉన్న పత్రాలను సమర్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు స్పష్టం చేశారు. అలాగే అధికారులకు ముందస్తు సమాచా రం ఇవ్వకుండా డాక్టర్లను, ఇతర సిబ్బందిని నియమించుకున్న ఆసుపత్రులపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ప్రాణాలతో చెలగాటం..
ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అనుభవం లేని వైద్యులను నియమించుకొని రోగుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు. యాజమాన్యాలు తాము నియమించుకున్న వైద్యులు వద్ద మెడికల్ లైసెన్స్ ఉందా? లేదా? అనేది నిర్థారించడంలో ఆలసత్వం ప్రదర్శిస్తున్నాయి. గతే డాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైద్యారోగ్య శాఖ అధికారులు అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేయడమే గాక, ఐదుగురు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయడం సమస్య లోతును సూచిస్తోంది.
అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నగరంలో ఇప్పటికీ నకిలీ డాక్యుమెంట్లతోనే చాలా ఆసుపత్రులు యధావిథిగా నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఇచ్చే లంచాలకు మరిగి డ్యూటీ పేరుతో తమ దృష్టికి వచ్చిన ఒక పది నకిలీ క్లినిక్‌లను సీజ్ చేసి తమ పని ముగిసిదంటూ చేతు లు దులుపుకుంటున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం ఒక వ్యాపార సరుకుగా మారిపోవడం శోచనీయం.
ఈ పరిస్థితుల్లో పేద లకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రద్దీకి తగ్గట్లుగా బెడ్‌లు, సిబ్బంది లేకపోవడంతో సేవలందించడం సవాల్‌గా మారిపోయింది.
దీనికి తోడు, వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లను రిఫర్ చేస్తుండడంతో, పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం తమ దగ్గరికి వచ్చే రోగుల వద్ద నుంచి అందినకాడికి దోచుకుంటూ, అర్హత లేని వైద్యులతో చికిత్సలు చేసి ప్రాణాలతో చెలగాటమాడడం సర్వసాధారణమైపోయింది.
నిరంతర నిఘా..
హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు కాసులకు కక్కుర్తి పడి రోగుల ప్రాణాలతో ఆడుకోవడం అలవాటుగా మార్చుకున్నాయి. వైద్య సేవ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నా యి. రోగుల పరిస్థితిని వారి కుటుంబసభ్యులకు చెప్పకుండా లక్షల రూపాయలు తీసుకుంటూ, చివరి నిమిషంలో హడావి డి చేసి మరో ఆస్పత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఇలా చెప్పుకుం టూ పోతే ఈ ఆస్పత్రులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
ప్రభుత్వ చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, నిరంతర పర్యవేక్షణ, కఠిన చర్యలతో అమ లు జరగాలి. నకిలీ డాక్టర్లు, అనుమతులు లేనిఆసుపత్రులపై కేసులు నమోదు చేయడంతో పాటు, వాటిని పూర్తిగా మూసివే సేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో, ప్రభుత్వ ఆసుపత్రుల సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించాలి.
ప్రజల ఆరోగ్యం అనేది అధిక లాభాపేక్షతో కూడిన వ్యాపారం కాకూడ దు. ప్రైవేట్, కార్పోరేట్ ఆస్పత్రుల అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే, ప్రభుత్వం దీర్ఘకాలిక విధానాలతో జోక్యం చేసుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రులపై తనిఖీలు కొన్ని రోజులకే పరిమితం కాకుండా, నిరంతర నిఘా, ఫీజుల నియంత్రణ, నకిలీ వైద్యులపై కఠిన శిక్షలు ఇవన్నీ అమలైతేనే ఈ వ్యవస్థలో సంస్కరణలు సాధ్యం. ప్రజల ఆరోగ్య హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
వ్యాసకర్త సెల్: 97017 03684