20-02-2026 12:00:00 AM
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భద్రతా కారణాలను సాకుగా చూపి భారత్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌కు దూరమవడం వారి స్వయంకృతాపరాధమే. ఆటలను రాజకీయాలతో ముడిపెట్టకూడదన్న విషయం తెలిసి కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తన మొండి వైఖరిని ప్రదర్శించి భంగపాటుకు గురైంది. భారత్‌లో ఆడడం వల్ల బంగ్లా ఆటగాళ్లకు వచ్చిన ముప్పేమీ లేదని, భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు లేవని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పేర్కొన్నప్పటికీ వారి మాటను పెడచెవిన పెట్టింది.
దీంతో ఐసీసీ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించింది. అయితే బంగ్లాదేశ్‌లో ఏడాదిన్నర అశాంతి తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికారాన్ని చేపట్టింది. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం దేశాభివృద్ధే ముఖ్యంగా పాలన కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ నూతన క్రీడాశాఖ మంత్రి అమీనుల్ హక్.. భారత్‌తో తమ సంబంధాలను పునరుద్ధరించడానికి ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొనడం ముదావహం.
ఆటకు సంబంధించి బీసీసీఐతో త్వరలోనే సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. క్రీడలతో సహా అన్ని రంగాల్లోనూ భారతదేశంతో స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరచుకోవాలని బంగ్లాదేశ్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. నిజానికి ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌లో జరిగిన ఆందోళనలను ఆటతో ముడిపెట్టి చూడడం సరికాదు. భారత వ్యతిరేకులుగా ముద్రపడిన మతఛాందసవాద శక్తుల మాయలో పడిన అక్కడి యువత క్రీడలు సహా అన్ని రంగాల్లో భారత్‌తో తెగదెంపులు చేసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు.
దీనికి అప్పటి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కూడా వంతపాడడంతో బంగ్లా క్రికెట్ బోర్డు క్రికెటేతర రాజకీయాలకు తెరలేపింది. భారత్‌కు దూరమవ్వడాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న పాకిస్థాన్ కూడా బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్‌కు మద్దతుగా ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని తెగేసి చెప్పింది. కానీ పరిస్థితులు దృష్ట్యా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
బంగ్లాదేశ్, శ్రీలంక విజ్ఞప్తి మేరకే భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు తెలిపి తమ కపట బుద్ధిని బయటపెట్టుకుంది. పాక్ అవకాశం చిక్కినప్పుడల్లా భారత్‌పై బురద జల్లే యత్నం చేస్తూనే వచ్చింది. అంతకముందు ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా కప్ అందుకోవడం ఇష్టం లేక ఒట్టి చేతులతో స్వదేశానికి తిరిగొచ్చింది. కానీ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మోసిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లిపోవడం వివాదాస్పదమయింది.
తాజాగా భారత్‌తో సత్సంబంధాలను కొనసాగించేందుకు ఆసక్తితో ఉన్న ట్లు బంగ్లా చెప్పడం శుభపరిణామం. ఇటీవలే ఎన్నికల్లో బీఎన్పీ అఖండ విజయం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలపడమే గాక, బంగ్లాతో సంబంధాల పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అటు బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తారిఖ్ రెహ్మాన్ పొరుగు దేశాలన్నింటితో మెరుగైన సంబంధాలనే కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.