9 May, 2026 | 2:37 AM

కాళ్లు పట్టుకొని వేడుకుంటున్న కర్షకులు

09-05-2026 12:00 AM

ఉచిత సలహాలకే పరిమితమైతున్న అధికారులు... 

కొనుగోలు కేంద్రాల వైపు చూడని పాలకులు... 

దిక్కుతోచని స్థితిలో రైతన్నలు 

మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి): దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు పండించిన పంటను అమ్ముకునేందుకు అధికారుల కాళ్లు మొక్కాల్సిన దుస్థితి మంచిర్యాల జిల్లాలో వచ్చింది... రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఆలస్యంగా మొదలు పెట్టగా, కాంటా వేసి మిల్లుకు పంపించేందుకు కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ ఇచ్చేందుకు దాదాపు నెల వరకు వేచి చూడాల్సి వచ్చింది.

దీనితో పీసీసీలకు తీసుకొచ్చిన ధాన్యం ఆరడంతో కుప్పలుగా పోసుకొని తూకం చేస్తరని ఆశతో ఎదురుచూడటం తప్ప కాంటా చేసేది లేదు.., మిల్లులకు తరలించుడు లేదు.. అక్కడక్కడ రెండు, మూడు లారీలు వెళ్లినా అవి మూడు, నాలుగు రోజులు మిల్లు వద్దనే నిలిచి ఉండటంతో మరో వాహనం రాక రైతులకు ఇబ్బందులు ఆదిలోనే ప్రారంభమయ్యాయి.

కాళ్లు పట్టి వేడుకుంటున్న కర్షకులు... 

కొనుగోళ్లు నత్తనడకగా సాగుతుండటం, ఈ సమయంలోనే ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు. తూకం వేసిన వేల సంఖ్యలో బ్యాగులు, ఆరి కుప్పగా పోసిన ధాన్యం వర్షానికి తడిసిముద్దయ్యాయి. నిర్వాహకులేమో మళ్లీ ఆరబెట్టాలని, మ్యాచర్ వచ్చాకే మిల్లుకు పంపడం జరుగుతుందని పేర్కొనడంతో రైతన్నకు తిప్పలు మొదలయ్యాయి. తూకం వేసిన బస్తాలు వెంట వెంటనే మిల్లులకు తరలిస్తే ఈ సమస్య ఉండేది కాదని రాస్తారోకోలు, ధర్నాలకు దిగే పరిస్థితి మొదలైంది.

తమను ఆదుకోవాలని అధికారుల కాళ్లా, వేళ్లా పడాల్సిన దుస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని తనంతో రైతులు మండల స్థాయి అధికారి నుంచి మొదలు జిల్లా స్థాయి అధికారులను మొక్కి వేడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. రాజులా ఉండాల్సిన రైతులు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ అధికారుల కాళ్లు పట్టే పరిస్థితికి దిగజారడానికి కారకులైన పాలకులు ఇప్పటికైనా సోయికి రైతుల కష్టాలను తీర్చేందుకు ముందుకు రావాలని జిల్లా రైతాంగం వేడుకుంటుంది. 

ఉచిత సలహాలకే పరిమితమైతున్న అధికారులు... 

క్షేత్ర స్థాయిలో తిరిగి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు అవేమి చూడకుండానే జిల్లా అంతటా కొనుగోళ్లు సక్రమంగానే జరుగుతున్నాయని చెబుతూ కార్యాలయాల్లో కూర్చొని మిల్లర్లతో, మిల్లర్ అసోసియేషన్ నాయకులతో ఆమ్యామ్యాలు మాట్లాడుకుంటూ రైతులతో రెండు నుంచి మూడు కిలోల తూకం వేయించి పంపిస్తున్నారే తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరైన సమయంలో తూకం వేసి మిల్లులకు పంపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తూకం వేసిన బస్తాలు, ఆరబోసిన ధాన్యం వరణుడి పాలైతుందని, ఇప్పటికైనా ఒక్కో కొనుగోలు కేంద్రానికి అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని కర్షకులు కోరుతున్నారు. మరోవైపు పుండోకాడ ఉంటే మందు మరోకాడ రాసినట్టు అధికారుల తీరుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే సంబంధిత శాఖ అధికారులు మిల్లుల వద్ద ఫొటోలు దిగుతూ వస్తున్నారు తప్ప సమస్య ఉన్నచోటికి రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కొనుగోలు కేంద్రాల వైపు చూడని పాలకులు... 

జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడంలో నాయకులు ఏమాత్రం దృష్టి సారించడం లేదనేది జిల్లా పాలకులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. జిల్లాకు పేరుకే మంత్రి(గడ్డం వివేక్ వెంకటస్వామి), ఎంపీ (గడ్డం వంశీ కృష్ణ), ఎంఎల్‌ఏ(కొక్కిరాల ప్రేంసాగర్ రావు, గడ్డం వినోద్) లు ఉన్నారా? అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఇల్లు ఇల్లు తిరిగి ఓటు అడుక్కున్న నాయకులు నేడు రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కనీసం ఒక్క కొనుగోలు కేంద్రానికి వెళ్లడం లేదంటే రైతులకు మొఖం చూపించే ధైర్యం లేకనా? లేక రైతులు తిరుగబడుతారనే భయంతోనా..? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల జిల్లాలో గోడ కూలి నలుగురు రైతులు చస్తే రాలేని నాయకులు నేడు జిల్లాలో ఎలా తిరుగుతారని ప్రశ్నిస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని, ఇది నాయకులు గమనించాలని కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు రైతుల వద్దకొస్తుంటే ఓట్లు వేసి గెలిపించిన నాయకులు పట్టణాల్లో ఉండి చోధ్యం చూస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.