నిరంజన్‌రెడ్డిని అడ్డుకున్న ఏపీ పోలీసులు
తెలంగాణ నీటి హక్కులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే వచ్చాం: మాజీ మంత్రి
వనపర్తి,(విజయక్రాంతి) : శ్రీశైలం ప్రాజెక్టులోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలించేందుకు గురువారం వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూపాడు బంగ్లా వద్ద జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వినియోగంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే పోతిరెడ్డిపాడును పరిశీలించేందుకు వచ్చామని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ....తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఏపీకి నీటిని తరలించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.
ఎల్‌నినో ప్రభావం రెండు రాష్ట్రాలపై ఒకే విధంగా ఉంటుందని, ఆ కారణాన్ని చూపుతూ తెలంగాణ రైతులకు నీటి విడుదలలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఏపీ ప్రాంతానికి నీటిని అందిస్తున్నప్పుడు తెలంగాణ రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో పెద్ద మొత్తంలో నీటిని తరలించే అవకాశం ఉందని, తెలంగాణలో మాత్రం కృష్ణా నీటిని ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. కేఎల్‌ఐ పంపులు సక్రమంగా పనిచేయడం లేదని, రైతుల ఒత్తిడి వచ్చిన తర్వాతే నీటి విడుదలకు చర్యలు చేపట్టారని ఆయన విమర్శించారు. 162 కిలోమీటర్ల పొడవైన కాలువలో 102 కిలోమీటర్ల వరకు నీరు చేరని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో జూరాల ఆయకట్టు, లిఫ్ట్ ప్రాజెక్టులకు నీటి ఇబ్బంది ఉండదని ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలోనూ రైతులకు స్పష్టత ఇవ్వలేదని, ప్రజలకు వాస్తవాలను ప్రభుత్వం దాచిపెడుతోందని మాజీ మంత్రి ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో శ్రీశైలంలో తక్కువ నీటి నిల్వ ఉన్న సందర్భాల్లోనూ రైతులకు సాగునీరు అందించామని ఆయన గుర్తుచేశారు.
పోతిరెడ్డిపాడు నుంచి అధికారికంగా చెబుతున్న నీటి డ్రాకు, వాస్తవంగా జరుగుతున్న నీటి తరలింపునకు మధ్య వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించిన ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించిన నిరంజన్‌రెడ్డి, ఏపీ పోలీసులు తమను అడ్డుకోవడాన్ని ఖండించారు. పాలమూరు ప్రాంత రైతులకు నీటి హక్కులు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, జిల్లా ప్రజాప్రతినిధులు ఈ అంశంపై బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇది ఆందోళన కోసం కాదు.. వాస్తవాలను తెలుసుకునేందుకు వచ్చాం. తెలంగాణకు దక్కాల్సిన నీటిపై ప్రభుత్వ వైఖరి ప్రజలకు తెలియాలని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు






