పండుగ పూట పరేషాన్
పెరిగిన నిత్యావసర ధరలు
కరీంనగర్, మార్చి 15 (విజయక్రాంతి): ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధ ప్రభావం భారత్ పైన, క రీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలపైన పడింది. ఈ నెల 19న ప్రజలు తీపి, చేదు కలయికతో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతుండగా యుద్ధ ప్రభా వం ప్రజలపై పడింది. ఇప్పటికే గృహ వినియోగ సిలిండర్ పై 60 రూపాపాయలు, వాణిజ్య సిలిండర్ పై 114 రూపాయలు పెరిగింది. ఇది ఉమ్మడి జిల్లా వినియోగదారు లపై నెలకు తొమ్మిదిన్నర కోట్ల భారం. గ్యాస్ తోపాటు వంట నూనె ధరలు కూడా అ మాంతం పెరిగాయి.
లీటరుకు 10 నుంచి 20 రూపాయలు పెంచారు. రిటైల్ ధరలు పెరగడం వెనుక బ్లాక్ మార్కెట్ దందా నడిపేవారు ఉన్నారు. ఇరాన్ యుద్ధాన్ని ఆసరా గా చేసుకొని పండగపూట ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు రవాణాకు కీలకమైన హెర్ము జ్ కాలువ మూసివేయడంతో ముడి సరుకుల రవాణాలో తీవ్ర అంతరాయం ఏర్పడి పండగ పూట వంట గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికి పండగ సమయానికి అనుకున్న మేర సరఫరా కావడం కష్ట మే. ముఖ్యంగా హోటళ్లు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ దొరకడం కష్టం కానుంది.
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉగా ది పండుగకు అమ్మే పప్పు దినుసుల ధరలు కూడా కిలోకు 10 నుంచి 20 రూపాయలు పెంచారు. అలాగే ఉగాది పచ్చడికి ఉపయోగించే మామిడి ధర కూడా ప్రస్తుతం మా ర్కెట్లో ఎక్కువగానే ఉంది. ఒక్కో కాయ 20 రూపాయలకు అమ్ముతుండడంతో ఉగాది పండగపై ప్రభావం పడనుంది. వంటి నూనె కూడా బ్లాక్ లో ఉంచి మరింత పెంచేందుకు హోల్ సేల్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు.
గ్రానైట్ వ్యాపారంపై ప్రభావం...
యుద్ధ ప్రభావం ఒక నిత్యావసర సరుకులపైనే కాదు గ్రానైట్ వ్యాపారంపై కూడా పడింది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ దేశా ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉమ్మడి జిల్లా లో గ్రానైట్ ఉత్పత్తిపై ప్రభావం పడింది. యుద్ధం నేపథ్యంలో గ్రానైట్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఓడలపై ఆంక్షలు విధించంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిన గ్రానైట్ మార్బుల్స్, స్టోన్ కంటెయినర్లు కాకినాడ పోర్టులో నిలిచిపోతున్నాయి. ముఖ్యం గా కరీంనగర్ జిల్లాలో లభించే టాన్ బ్రౌన్, మేపిల్ బ్రౌన్ గ్రానైట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడి నుంచి గ్రానైట్ ఎక్కువగా చైనాతోపాటు ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దేశాలకు ఎగుమతి అవుతుంది.
యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయాయి. ఓడ రేవుల వద్ద షిప్ ఓనర్లు 20 నుంచి 29 డాలర్లకు రేట్లు పెంచడంతో దీంతో వ్యాపారులు ఎగుమతులు చేయలేక వెనకడుగు వేస్తున్నారు. అలాగే 2 లక్షల రూపాయల వరకు ఇరాన్ వార్ సెస్ భారం మోపుతుండడంతో కాకినాడ పోర్టులోనే గ్రానైట్ బండలు నిలిచిపోతున్నాయి. కరోనా తర్వాత మళ్లీ కరీంనగర్ జిల్లాలోని 292, సిరిసిల్లో 40, పెద్దపల్లి, జగిత్యాలలోని 80 క్వారీలపై, అందులో పనిచేస్తున్న సిబ్బందిపై యుద్ధ ప్రభావం పడింది. యుద్ధం ఆగకుంటే ఈ వ్యాపారం ఆధారపడ్డ కుటుంబాలకు పండగపూట పస్తులు తప్పవు.




