10 May, 2026 | 1:23 AM

శిథిలావస్థలో దొరల బురుజులు!

10-05-2026 12:02 AM

తూప్రాన్ (విజయక్రాంతి) : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలోని మెడక చెరువు సమీపంలో పురాతన కాలంనాటి బురుజులు ఉన్నాయి. ఈ బురుజులతో పాటు ధ్వజ స్తంభం కూడా ఉన్నది. ఆనాటి వడ్డేపల్లి దొరలు నాటి పరిపాలన విధానం, ప్రజల సౌలభ్యం కోసం వీటిని నిర్మించారు. స్వాతంత్య్రానికి పూర్వం రాజులు, సామంత రాజుల ఆధీనంలో గడీల పరిపాలన కొనసాగేది. ఇందులో భాగంగానే నేటి తూప్రాన్ పట్టణం గతంలో తూర్పురాణి, తూపురానిగా ఉండేది.

కాలక్రమేనా తూప్రాన్‌గా మారింది. ఈ బురుజుల సంస్థానంలో కర్ణకంటి, వడ్డేపల్లి, దొంతి దొరవారిలు పాలన కొనసాగించేవారు. పక్క మండలం శివంపేట పరిధిలో దొంతి దొరవారి గడీలు ఉన్నవి. నాటి రాజు లు పాలన విధానం వడ్డేపల్లి దొరవారి నుంచి దొంతి దొరవారి గడీల వరకు సమాచార నిమిత్తం ఈ బురుజులని ఏర్పాటు చేశారని గ్రామ పెద్దలు చెపుతుంటా రు.

ఇవి యుద్ధాలు సమీపించిన సమయంలో శత్రువులు ఎక్కడ నుండి వస్తారో అనే విషయం తెలుసుకో వడానికి వీటి పైన దివిటీలు పట్టుకొని రక్షక భటులు చూసేవారని, ఎవరైనా శత్రువులు ఈ గడీలలో చొరబడినప్పుడు వారు ఒక శబ్ద రూపంలో రాజుకు సమాచారం అందించేవారు. కానీ నేడు ఈ బురుజుల పరిస్థితి చూస్తే ఆధ్వానంగా తయారయింది.

రాజరిక పాలన విధానానికి తార్కాణాలుగా ఉన్న బురుజులు నేడు శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ బురుజుల ఆధీనంలో ఉన్న భూముల పరిరక్షణ కరువైంది. నేటికైనా ఈ బురుజులను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.