1 June, 2026 | 7:01 PM

దేశంలోనే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు రూ 5 లక్షల ఆర్థిక సాయం

01-06-2026 06:29 PM

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ  ఇండ్లకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తెలంగాణ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ...ఇండ్ల లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇండ్లు మంజూరి చేయకుండా పేదలు అన్యాయానికి గురయ్యారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన అందరికీ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు.  ఈ జూన్ మాసంలో రెండవ దశ ఇండ్ల మంజూరు జరుగుతుందని తెలిపారు.

ప్రతి నియోజక వర్గానికి 1500 నుండి 2000 లోపు వచ్చే ఇండ్లను అర్హులైన అందరికీ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించిన ఘనత దేశంలో ఒక్క రేవంత రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పేదలు, రైతుల పక్షపాతి అని చెప్పారు.అలాగే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు అసంపూర్తిగా నిర్మించుకున్న వారికి, స్లాబ్ వేసుకొని వారికి కొత్తగా అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు.

పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒకవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు, మరోవైపు గ్రామ గ్రామాన అభివృద్ధి పనులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో దూసుకు వెళ్తోందని విజయ రమణారావుఅన్నారు.సుల్తానాబాద్ మండలం రూరల్ గ్రామాల్లో 770 ఇండ్లు మంజూరు కాగా 200 ఇండ్లు నిర్మాణాలు ప్రారంభించకపోవడంతో అధికారులు రద్దు చేశారని చెప్పారు. ఇందులో 140 నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిలో 90 శాతం పూర్తికా వస్తున్నాయని చెప్పారు. నెలన్నర రోజుల్లోగా అన్ని ఇండ్లకు ప్రారంభోత్సవాలు జరుగుతాయని అన్నారు.