ప్లాస్టిక్ నిర్మూలనకు ఉపాధ్యాయుల ఆదర్శం
ఇంటి నుంచే ప్లేట్లు, గ్లాసులు తెచ్చుకుని భోజనం
ములకలపల్లి,(విజయక్రాంతి): చిన్న చర్య సమాజంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందనే విషయాన్ని ములకలపల్లిలో నిర్వహిస్తున్న ఎస్జిటి ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణలో ఉపాధ్యాయులు ఆచరణలో చూపించారు. ఉపాధ్యాయుడు కే.శ్రీరామ్ చొరవతో పాఠశాల విద్యాశాఖ అధ్వర్యంలో స్థానిక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో సోమవారం పాల్గొన్న ఉపాధ్యాయులు ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం భోజనం కోసం ఇంటి నుంచే తమ ప్లేట్లు, గ్లాసులు తెచ్చుకున్నారు.
ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా ప్రతి ఒక్కరూ తమ సొంత ప్లేట్లను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రత్యేకించి ఉపాధ్యాయులు ఈ విధంగా ముందడుగు వేయడం విద్యార్థులు, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించేందుకు దోహదపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మండల విద్యాధికారి (ఎంఈఓ) జి. సత్యనారాయణ కోర్సు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.






