రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి
రైతుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్‌కు..
ప్రజలే బుద్ధి చెబుతారు: గొంగల రంజిత్ కుమార్
గద్వాల సెప్టెంబర్ 15: జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్(Quality electricity) సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన గద్వాల ఇన్చార్జి గొంగల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణవేణి సౌకర్యం నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు బైక్‌లపై ర్యాలీగా వెళ్లి జిల్లా విద్యుత్ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గొంగల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయానికి సరైన విద్యుత్ అందకపోతే పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రైతులు, పేదలు, సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రజలను నిరాశపరిచిందని రంజిత్ కుమార్ విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల నుంచి ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.
రైతులు విద్యుత్ కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని గొంగల రంజిత్ కుమార్ అన్నారు. రైతుల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.