గిల్, కోహ్లీ ధనాదన్

28-09-2026 | 05:25am

వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలకు అదిరిపోయే ఆరంభం... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను (ODI series)భారత్ అద్భుత విజయంతో మొదలుపెట్టింది. గిల్ క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొడితే, చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ క్లాస్, మాస్, ఊర మాస్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. ఫలితంగా 297 పరుగుల టార్గెట్ వీరి బ్యాటింగ్ ముందు తేలిపోయింది. 

  1. తొలి వన్డేలో భారత్ ఘన విజయం 
  2. విండీస్ బౌలర్లకు చుక్కలు
  3. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్
  4. విరాట్ విశ్వరూపం 

తిరువనంతపురం, సెప్టెంబర్ 27 : టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ (India fielding)ఎంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై వెస్టిండీస్‌కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. జస్టిన్ గ్రీవ్స్, జాన్ కాంప్‌బెల్ తొలి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాంప్‌బెల్ 60 బంతుల్లో 62 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ వన్డేల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇతడు 108 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు.

అయితే కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో విండీస్ మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. 135/0 తో బలంగా ఉన్న విండీస్.. కార్టీ (13), షాయ్ హోప్ (12) తక్కువ స్కోరుకే నిష్క్రమించడంతో ఒక దశలో 198 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో వికెట్లు పడుతున్నా అమీర్ జంగూ వేగంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇతడు 38 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో వెస్టిండీస్ 295 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి విండీస్ భారీ స్కోరు వేగాన్ని కట్టడి చేశాడు. తర్వాత భారీ లక్ష్య చేదనలో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు మొదటి పవర్‌ప్ల్లే ముగిసేసరికి 70 పరుగులు జోడించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 110 పరుగులతో అద్భుత సెంచరీ చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. వన్డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ మెరుపు సెంచరీతో (నాటౌట్) రాణించాడు.

ఈ ఇన్నింగ్స్ ద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో 15,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే రెండవ బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు.303 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే కరేబియన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.

కింగ్ కోహ్లీ దూకుడు ఇన్నింగ్స్ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించింది. వన్డేలలో విరాట్ కోహ్లీకి ఇది 55వ సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో 86వది. కాగా కోహ్లీ 88 బంతుల్లో 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. విరాట్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. 42వ ఓవర్లో 8 వికెట్ల తేడాతో జట్టు మ్యాచ్ గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.

స్కోరు బోర్డు 

వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 295/7 ( గ్రీవ్స్ 101, క్యాంప్ బెల్ 62, జంగూ 58; కుల్దీప్ యాదవ్ 4/40,  ప్రసిద్ధ కృష్ణ 2/60 )

భారత్ ఇన్నింగ్స్ : 300/2 ( గిల్ 110, కోహ్లీ 139 నాటౌట్, రోహిత్ శర్మ  32; చేజ్ 1/64, జోసెఫ్ 1/81 )


మరిన్ని వార్తలు