కాంగ్రెస్‌తోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు
పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల
కాల్వ శ్రీరాంపూర్‌లో విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 15(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఉంటూ నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హరే రామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఉదయమే వ్యవసాయ, ఇతర పనులకు వెళ్లిపోతారని, దీంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చేసరికి అల్పాహారం తీసుకోలేని పరిస్థితులు ఉంటాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని చెప్పారు.
వారానికి ఆరు రోజులు పౌష్టిక అల్పాహారం
విద్యార్థులకు వారానికి ఆరు రోజులు ఇడ్లీ సాంబార్, పూరీ ఆలుకుర్మ, దోస, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ సాంబార్, బోండా వంటి వివిధ రకాల అల్పాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకుని తమ గ్రామానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పెద్దపల్లిలో రూ.65 కోట్లతో పాఠశాలల అభివృద్ధి
పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే రూ.65 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్, నూతన భవనాలు, టాయిలెట్లు, ఆధునీకరణ తదితర అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తున్నామని విజయరమణ రావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని, ఇదే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకు నిదర్శనమని పేర్కొన్నారు.
రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల
పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఏడాది కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని,
కులమతాలకు అతీతంగా విద్యార్థులందరూ సమానమే అనే భావనతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాలను ప్రారంభించగా ప్రస్తుతం సుమారు 1,600 మంది విద్యార్థులతో కొనసాగుతోందన్నారు.
పేద విద్యార్థుల ఆకలి బాధలను తీర్చేందుకు తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున విజయరమణ రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.