అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం
సదాశివనగర్,ఏప్రిల్ 30(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని లబ్ధిదారులు ఎక్కడ ఎవరికి రూపాయి ఇవ్వద్దని ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ వెల్లడించారు. గురువారం సదాశివనగర్ మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో రూ 25 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు. అదనంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అడ్లూర్ ఎల్లారెడ్డిలో వైద్య సేవలు, తాగునీటి, కరెంటు స్తంభాల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. హెల్త్ సెంటర్ ప్రారంభంతో గ్రామ ప్రజలకు సమీపంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. ఇప్పటివరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండగా, ఇప్పుడు అదే సేవలు గ్రామంలోనే పొందే అవకాశం కలిగిందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రధానమని పేర్కొన్నారు. హెల్త్ సెంటర్ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి అదనంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలోని బీసీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రెండు బోర్‌వెల్లు తవ్వించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
గ్రామంలో ఉన్న పాత ఐరన్ విద్యుత్ స్థంభాల స్థానంలో సిమెంట్ స్థంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎడ్ల నర్సింలు ఏఎంసీ చైర్మన్ సంగ్యా నాయక్, సి డి సి చైర్మన్ మొహమ్మద్ ఇర్షాదుద్దీన్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొంబోతుల లింగాగౌడ్, ఉప సర్పంచ్ పయ్యావుల గంగాధర్, మాజీ సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ లు గాదారి శ్రీనివాస్ రెడ్డి నోముల రూపేందర్ రెడ్డి సీనియర్ నాయకులు సురేందర్ రాథోడ్ శంకర్ నాయక్ పంచాయతి రాజ్ డి ఈ బాల్ లింగం, పి ఆర్ ఏ ఈ సురేష్ కుమార్ , వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






