14 June, 2026 | 1:49 AM

యోగా, పోషకాహార కలయికే ఆరోగ్యం

14-06-2026 12:00 AM

ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి సంబంధిత వ్యాధులు, ఊబకాయం, ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర ఆరోగ్య పద్ధతుల ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యోగా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు మాత్ర మే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎంపికలను ప్రోత్సహించే శక్తివంతమైన సాధనంగా గుర్తింపు పొందుతోంది.

క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల ఆహారపు ప్రవర్తనలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని ఇ టీవల కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. యోగా సాధన చేసే వ్యక్తులు ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవడం, జాగరూకతతో భోజనం చేయడం (మైండ్‌ఫుల్ ఈటింగ్) అలవాటు చేసుకోవడంతోపాటు కొన్ని రకాల ఆహార సంబంధిత రుగ్మతలను కూడా అధిగమించగలరని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యోగా ప్రయోజనాలు వ్యాయామ చాప వరకు మాత్రమే పరిమితం కాకుండా, వ్యక్తులు తమ శరీరాన్ని, మనసును ఎలా పోషించుకోవాలో ప్రభావితం చేస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ప్రాణశక్తిని మోసుకెళ్లే వాహకం

యోగ తత్వశాస్త్రం ప్రకారం ఆహారం శక్తి ని అందించే సాధనం మాత్రమే కాదు; అది ‘ప్రాణశక్తి’ని మోసుకెళ్లే వాహకం. ప్రాచీన యోగ గ్రంథాలు ఆహారాన్ని మూడు ప్రధా న వర్గాలుగా విభజించాయి. అవి సాత్విక, రాజసిక, తామసిక. తాజా పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, గింజలు, విత్త నాలు, ఔషధ మూలికలతో చేసిన టీ, కషాయాలు వంటి ఆహారాలు సాత్విక ఆహా రాలు. ఇవి మానసిక ప్రశాంతత, స్పష్టత, జీవశక్తి, ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందిస్తాయని యోగ శాస్త్రం చెబుతోంది.

అధిక మ సాలాలు, ఉద్రేకాన్ని కలిగించే పదార్థాలు రాజసిక ఆహారాలు. ఇవి చురుకుదనాన్ని పెంచినా, అధికంగా తీసుకుంటే ఆందోళన, అస్థిరతకు దారితీయవచ్చు. నిల్వ చేసిన, అధికంగా ప్రాసెస్ చేసిన, ఎక్కువగా వేయించిన ఆహారాలు తామసిక ఆహారాలు.

ఇవి అలసట, జడత్వం, అనారోగ్యానికి కారణమవు తాయి. ఆశ్చర్యకరంగా, ఆధునిక పోషకాహార శాస్త్రం కూడా ఈ సంప్రదాయ భావ నలకు మద్దతుగా నిలుస్తోంది. విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా కలిగి ఉండే సాత్విక ఆహార విధానం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.

శాస్త్రీయ ఆధారాలివే

యోగా సాధకుల ఆహారపు అలవాట్లపై నిర్వహించిన అధ్యయనాలు, యోగా చేయనివారితో పోలిస్తే వారు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, మొక్కల ఆధారిత ఆహారాలను తీసుకుంటారని వెల్లడించాయి. అలాగే వారు తక్కువ సంతృప్త కొవ్వులు, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటారు. ఈ మార్పులకు ప్రధాన కారణం యోగా ద్వారా పెరిగే ‘మైండ్‌ఫుల్‌నెస్’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్రమం తప్పకుండా యోగా చేసేవారు ఆకలి, తృప్తి, జీర్ణక్రియ, భావోద్వేగా లకు సంబంధించిన శరీర సంకేతాలను స్పష్టంగా గుర్తించగలుగుతారు. ఫలితంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నియంత్రించగలుగుతారు. పలు అధ్యయనాలు యోగా సాధకులు ఆహారంపై ఎక్కువ అవగాహన కలిగి ఉండటమే కాకుండా పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాలను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉం టాయని తెలియజేశాయి. సాత్విక ఆహారం ఎక్కువగా తీసుకునే వ్యక్తుల్లో ఆందోళన స్థాయులు తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగు పడుతున్నట్లు అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి.

పోషకాహార రంగానికి యోగా అందించిన గొప్ప బహుమతుల్లో మైండ్‌ఫుల్ ఈ టింగ్ ఒకటి. యోగా సాధకులు తమ ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక అనుభూతు లపై శ్రద్ధపెడతారు. ఈ అవగాహన ఆహారపు అలవాట్లపై కూడా సహజంగానే ప్రభా వం చూపుతుంది. మైండ్‌ఫుల్ ఈటింగ్ వల్ల వ్యక్తులు నెమ్మదిగా భోజనం చేయడం, నిజమైన ఆకలిని గుర్తించడం, ఆహారాన్ని ఆస్వా దించడం, భావోద్వేగాల ప్రభావంతో అధికంగా తినకుండా ఉండడం సాధ్యమవుతుంది.

ఈ అలవాట్లు ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడంలో, జీవనశైలి వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ‘క్రమం తప్పకుండా యోగా చేసేవారు కొన్ని ఆహారాలు తమ శక్తి, మనోభావాలు, మొ త్తం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో మరింత స్పష్టంగా గుర్తించగలుగు తున్నారు. ఈ అవగాహన కఠినమైన డైట్ నియమాలు లేకుండానే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారితీస్తుంది’ అని ఆరో గ్య నిపుణులు చెబుతున్నారు.

ఆహార రుగ్మతల నిర్వహణ

యోగా, ఆహార ప్రవర్తన మధ్య ఉన్న సం బంధం మానసిక ఆరోగ్యరంగంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. అనోరెక్సి యా నర్వోసా, బులీమియా నర్వోసా, బింజ్ ఈటింగ్ డిజార్డర్ వంటి సమస్యలు తరచూ ఆందోళన, డిప్రెషన్  శరీర రూపంపై అసంతృప్తితో ముడిపడి ఉంటాయి. యోగా ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయక చికిత్సగా ఉపయోగపడుతుందని పరి శోధనలు సూచిస్తున్నాయి.

శారీరక కదలికలు, శ్వాసాభ్యాసాలు, ధ్యానం ద్వారా వ్యక్తు లు తమ శరీరంతో మళ్లీ సానుకూల సంబంధాన్ని ఏర్పరుచుకోవడంలో యోగా సహా యపడుతుంది. యోగ ఆధారిత కార్యక్రమాల్లో పాల్గొన్నవారిలో ఆత్మవిశ్వాసం, శ రీర సంతృప్తి, భావోద్వేగ నియంత్రణ మెరుగుపడటంతో పాటు బలవంతపు ఆహారపు అలవాట్లు తగ్గినట్లు అధ్యయనాలు తెలియజేశాయి. అయితే యోగా వైద్య, మానసిక చికిత్సలకు ప్రత్యామ్నాయం కాకుండా, వాటికి అనుబంధంగా ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

స్వీయ క్రమశిక్షణకు దోహదం

పోషకాహారం, యోగా కలిసినప్పుడే అ త్యుత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. సమతుల ఆహారం యోగా సాధనకు అవసరమైన శక్తి, ఏకాగ్రతను అందిస్తే, యోగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించేందుకు అవసరమైన అవగాహన, స్వీయ క్రమశిక్షణను పెంపొందిస్తుంది. యోగా సా ధనకు ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని, సాధన అనంతరం పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం కూడా శరీర శక్తి సమతుల్యతను కాపాడటానికి అవసరం.

సమగ్ర ఆరోగ్యానికి మార్గం

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు నివారణాత్మక ఆరోగ్య విధానాల ప్రాముఖ్యతను గుర్తి స్తున్న కొద్దీ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడంలో యోగా పాత్ర కు మరింత గుర్తింపు లభిస్తోంది. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, పోషకాహారం, మైండ్‌ఫుల్‌నెస్, భావోద్వేగ సమతుల్యత, స్వీయ అవగాహనలను సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధానాన్ని అందిస్తుంది.

ఊబకాయం, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సవాళ్లను అధిగమించడంలో ఈ సమగ్ర విధానం కీలకపాత్ర పోషించగలదని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఆహార ఎంపికలు విస్తారంగా ఉన్నప్పటికీ అయోమయం పెరుగుతున్న నేటి ప్రపంచంలో యోగా ఒక సరళమైన, గంభీరమైన సందేశాన్ని అందిస్తోంది.

అదేమిటంటే పోషణ అనేది శరీరా న్ని నింపడం మాత్రమే కాదు; జీవితంలోని ప్రతి అంశంలో సమతుల్యత, అవగాహన, శ్రేయస్సును పెంపొందించుకోవడం. ‘జాగరూకతతో ఆచరించినప్పుడు యోగా, పోష కాహారం రెండూ ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, సంతృప్తికరమైన జీవితానికి మార్గదర్శకాలు అవుతాయి.

 డాక్టర్ యం. అఖిల మిత్ర, 

ప్రజారోగ్య సలహాదారు