విపక్షాల బలహీనతే పాలకుల బలం
డా.తిరునహరి శేషు :
ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయటంలో, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లటంలో, పరిష్కరించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి చేయటంలో, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకపోవటంలో ప్రతిపక్షం కీలక భూమి క పోషిస్తుంది. ప్రతిపక్షం అంటే పాలకపక్షంపై పోరాటం చేసే వైరి పక్షం కాదు, ప్రజల కోసం పోరాడే ప్రజాపక్షం. అలా పనిచేసినప్పుడే దాని విద్యుక్త ధర్మం నిర్వర్తించినట్లుగా భావించాలి.
దురదృష్టవశాత్తు భారత్‌ను సుదీర్ఘకా లం పాలించిన ప్రధానులు నెహ్రూ (4398 రోజులు), ఇందిరాగాంధీ (4077), మోదీ (4402) ప్రభుత్వాలు బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోకపోవటం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో వెలితిగానే కనిపిస్తుంది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రెండు పర్యాయాలు ఏ ఒక్క విపక్ష పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
కానీ, 2024 లోక్‌సభ ఎన్నికలలో విపక్షం లోక్‌సభలో కొంత బలపడినా, తర్వాత వివిధ రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓడిపోయింది. దాంతో పాటు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల లో విపక్ష ఇండియా కూటమి బలహీనపడటంతో పాలకపక్షం దేశంలో మరొకసారి తిరుగులేని రాజకీయ శక్తిగా కనిపిస్తున్నది.
సానుకూలతను కొనసాగించడంలో విఫలం
మోదీ నేతృత్వంలోని బలమైన ఎన్డీయే కూటమిని ఎదుర్కోవడానికి 18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023లో బీజేపీని వ్యతిరేకించే 28 పార్టీలతో ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు. కానీ, ఆ కూటమి ఏర్పాటుకి చొరవ తీసుకున్న నాటి బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో పాటు మరో పార్టీ ఆర్‌ఎల్‌డీ అధినేత ఎన్నికలకు ముందు కూటమి నుంచి నిష్క్రమించాయి.
అయినా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమిలోని పక్షాలు సుమారు 230 లోక్‌సభ స్థానాలలో విజయం సాధించాయి. దీంతో ఒక దశాబ్దం తర్వాత బీజేపీ ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటుకి కావలసిన సాధారణ మెజారి టీని కూడా సాధించలేకపోయింది. అదే సమయంలో 99 లోక్‌సభ స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాని పొందింది. లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎంపిక య్యారు.
లోక్‌సభ ఎన్నికలలో సాధించిన అనుకూల రాజకీయ వాతావరణాన్ని కొనసాగించడంలో విపక్ష ఇండియా కూ టమి వైఫల్యం చెందింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన మొట్టమొదటి హర్యానా శాసనసభ ఎన్నికలలో కాం గ్రెస్ పార్టీ తన గెలుపు అవకాశాలను జారవిడుచుకుంది. అక్కడి నుంచి ప్రారంభమైన ఇండియా కూటమి అపజయాల పరంపర మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ శాసనసభ ఎన్నికల వరకు సాగింది. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితో విపక్షం బలహీనపడింది.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఇండియా కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలైన టీఎంసీ, డీఎంకేలు పశ్చిమ బంగా ల్, తమిళనాడులో అధికారాన్ని కోల్పోయాయి. ఆ తర్వా త జరిగిన రాజకీయ పరిణామాలు టీఎంసీ పార్లమెంటరీ పార్టీలో చీలికకు దారితీశాయి. మరోవైపు డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి వైదొలగడంతో ఒక రకంగా రాజకీయంగా విపక్ష ఇండియా కూటమి బలహీనపడిందనే చెప్పాలి.
131వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియా కూటమికి చెందిన 238 మంది లోక్‌సభ సభ్యులు ఓటు వేశారు. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇం డియా కూటమిలో చోటుచేసుకున్న పరిణామాలు కూట మి బలాన్ని తగ్గించాయనే చెప్పాలి. గత మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని సమ న్వయం చేయటంలో, బలోపేతం చేయటంలో వైఫల్యం చెందడంతో విపక్షం ఏ దశలోనూ రాజకీయంగా అధికార పక్షాన్ని సవాల్ చేయలేకపోయింది.
ఎదురులేని నరేంద్ర మోదీ సర్కార్
ప్రజల ఓట్లతో ఎన్నికై అత్యధిక కాలం పనిచేసిన ప్రజాప్రతినిధిగా, ప్రధానమంత్రిగా మోదీ వరుసగా రికార్డులు నెలకొల్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన వ్యక్తి మోదీ అని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ ప్రకటించింది. అయితే 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2014లో భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశంలో అటు పార్టీలో కాని, ఇటు విపక్షాల నుంచి కాని పెద్దగా సవాళ్లు మోదీకి ఎదురుకాలేదనే చెప్పాలి.
దేశ రాజకీయాలలో చాలా కాలం తర్వాత ఇందిరాగాంధీ లాంటి ఒక బలమైన రాజకీయ నాయకుడిని మోదీ రూపంలో ఈ తరం చూస్తున్నది. రాజకీయాలలో గెలుపోటములు సహ జం, సర్వసాధారణమే. కానీ, మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ మునుపెన్నడూ లేనంతగా బలమైన రాజకీయ పార్టీగా ఎదిగింది. ప్రతి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారు కాబట్టే, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే వ్యూహంతో పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.
లోక్ సభ ఎన్నికలలో మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో నిరుత్సాహపూరితమైన ఫలితాలు వచ్చినా, తర్వాత ఆ మూడు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయాలు సాధించింది. దీన్నిబట్టి మోదీ-షాల రాజకీ య వ్యూహాలు, ఎన్నికల ఎత్తుగడలు ఎంత బలంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ పుష్కరకాలంలో రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాల పట్ల అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నా, మెజార్టీ ప్రజలను తన విధానాల పట్ల మో దీ ఆకర్షితులను చేస్తున్నారనే భావన కలుగుతున్నది.
భాగస్వామ్య పక్షాల మద్దతుతో మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. గతంలో లాగా కొన్ని కీలకమైన బిల్లులను ఏకపక్షంగా ఆమోదింపజేసుకోలేక పోతున్నా రు. కానీ ఇటీవల దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మళ్లీ మోదీని రాజకీయంగా మరింత బలో పేతం చేసే దిశగా సాగుతున్నాయి.
భవిష్యత్తులోనైనా సవాల్ విసురుతారా?
మోదీ ప్రధానిగా వ్యవహరించిన ఈ పుష్కర కాలంలో ప్రతిపక్షం బలహీనతల వలన పాలక పక్షానికి ఎదురులేకుండా పోయింది. కానీ, భవిష్యత్తులో మోదీ అనేక రాజ కీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. తరిగిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, రూపాయి విలువ పత నం, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం వలన పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, ఇటీవల మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం విమర్శల పాలుకావటం, నిరుద్యోగ యువతలో పెరిగిపోతున్న అసంతృప్తితో పుట్టుకొచ్చిన కాక్రోచ్‌ల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట కొంత మసకబా రిందనే చెప్పాలి.
నీట్ ప్రశ్నాపత్రాల లీక్, సీబీఎస్‌ఈ జవాబు పత్రాల మూల్యాంకనంలో దొర్లిన తప్పులు, ఎస్సెస్సీ, ఇతర పరీక్ష నిర్వహణలో వైఫల్యంతో దాదాపుగా 55 లక్షల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. ఈ క్రమంలో ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అభిజిత్ దీప్కే నేతృత్వంలో కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. అయితే, మంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంతో ప్రజల నుంచి మోదీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
బెంగాల్ ఎన్నికలలో గెలుపు రాజకీయంగా బీజేపీని ఎంత బలోపేతం చేసిం దో, 2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే అంతకంటే రాజకీయంగా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు సమాజ్‌వాదీ పార్టీకి ప్రతిష్టా త్మకంగా మారబోతున్నాయి. నెహ్రూ, ఇందిర నెలకొల్పిన రికార్డులను మోదీ అధిగమించవచ్చు. కానీ, తన పాలనాకాలంలో దేశాన్ని ఎంత బలంగా నిర్మించారో భవిష్యత్తు తరాలు చెప్పుకొనే విధంగా పాలించడమే మోదీ కీర్తిప్రతిష్టలను పెంచుతుందని మర్చిపోవద్దు.
వ్యాసకర్త సెల్: 9885465877






