చినుకు పడితే భయం
ఒకప్పుడు సరస్సుల నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నేడు చిన్నపాటి వర్షానికే నీటమునుగుతుండటం మహానగర ప్రతిష్టకు మచ్చ తెస్తున్నది. ముఖ్యంగా తొలకరి చినుకులకే ప్రధాన రహదారులు సరస్సులను తలపిస్తుండటం, అనేక కాలనీలు జలమయం అవుతుండటం శోచనీయం. ఆధునిక నగరాభివృద్ధికి ప్రతీకలైన ఐటీ కారిడార్ ప్రాంతాలు కూడా వరదల ముంపునకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు ఇది ప్రతికూలాంశంగా మారిందని చెప్పక తప్పదు. అయితే, ప్రకృతి వైపరీత్యాల కంటే నగరాభివృద్ధిలో చోటుచేసుకున్న ప్రణాళికా వైఫల్యమే ఇందుకు మూలకారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉపాధి, వ్యాపార అవకాశాలు; విద్య, వైద్య అవసరాల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కోట్ల మంది హైదరాబాద్‌కు పోటెత్తుతున్న నేపథ్యంలో మహానగర విస్తరణ అనివార్యమే.
కానీ, ఈ విస్తరణతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగక పోవడం హైదరాబాద్‌కు పెనుశాపంగా మారింది. వాస్తవానికి 1908లో నగరాన్ని మూసీ ముంచెత్తిన తర్వాత ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వర య్య మార్గదర్శకత్వంలో నాటి నిజాం సర్కార్ సుమారు 70 కిలోమీటర్ల మేర నాలాలను నిర్మించింది. నాటి నుంచి కాలక్రమంలో వివిధ ప్రభుత్వాల హయాంలో నాలాల విస్తరణతోపాటు ఆక్రమణలు కూడా పెరిగాయి.
కాగా, పాత మొహల్లాలు మొఘల్‌పుర, ఫతే దర్వాజా లాంటి ప్రాంతాలకు వరద తాకిడి లేకపోవడం, ఆ తర్వాతి కాలంలో నాలాలను ఆక్రమించి పురుడుపోసుకున్న ప్రాంతాలే ఎక్కువగా ముంపునకు గురవుతుండటం నిజాం నాలా వ్యవస్థ పనితీరును తెలియజేస్తున్నది. ఒకప్పుడు హైదరాబాద్ నగరం గొలుసుకట్టు చెరువులు, బాగ్‌లకు (తోటలు) నెలవు. కానీ, కాలక్రమేణా చెరువుల స్థానంలో అపార్ట్‌మెంట్లు మొలిశాయి, తోటల స్థానంలో కాలనీలు వెలిశాయి. సహజసిద్ధమైన ప్రవాహ మార్గాన్ని మూసివేయడంతో వర్షపు నీరు తిరిగి ఇళ్లలోకి చేరుతున్నది.
అభివృద్ధి అంటే ఎత్తయిన భవనాలు, విశాలమైన రహదారులు, వ్యాపార సముదాయాలు మాత్రమే కాదు; మౌలిక వసతుల కల్పన, ప్రకృతితో సమన్వయం కూడా. నగరాభివృద్ధిలో ఈ సమతుల్యత పూర్తిగా దెబ్బతిన్న ఫలితంగానే నేడు ఐటీ ప్రాంతాలూ నీటిలో నానుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పాలకులు పాఠాలు నేర్చుకోవాలి. ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ పయనించాలి. అప్పుడే విశ్వనగరంగా ఎదగాలన్న హైదరాబాద్ స్వప్నం సాకారమవుతుంది.






