భువనగిరిలో హైటెన్షన్
- బీజేపీ, కాంగ్రెస్ బాహాబాహీ
- ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తల దాడి
- కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసం
- బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ శ్రేణుల ప్రతిదాడి
- ఇరుపార్టీల ఘర్షణతో ఉద్రిక్తత
- పోలీసుల లాఠీచార్జ్, పలువురి అరెస్ట్
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్న రాజకీయ ఘర్షణల(political clashes) ప్రభావం మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhongir district)నూ తాకింది. భువనగిరి పట్టణంలో బీజేపీ(BJP), కాంగ్రెస్ కార్యకర్తలు(Congress Workers) పరస్పరం దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు(BJYM activists) దాడి చేయడం, అనంతరం బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిదాడికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఏం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు నల్లరంగు పూయడాన్ని నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం కార్యక్తలు మంగళవారం భువనగిరిలోని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. కొందరు కార్యకర్తలు కార్యాలయం వెనుక నుంచి ప్రహరీ దూకి లోపలికి వెళ్లి కిటికీలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్‌రెడ్డి ఫొటోలపై నల్లరంగు చల్లారు.
సమాచారం అందుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యాలయానికి చేరుకుని ప్రతిదాడికి దిగారు. కార్యాలయంలో ఉన్న బీజేపీ కార్యకర్తలపై కోడిగుడ్లు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ నాయకులపై రాళ్లు రువ్వారు. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు..
ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు 14 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా రాజకీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ హెచ్చరించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ప్రతిదాడులకు పాల్పడవద్దు : ఎమ్మెల్యే కుంభం
ఘటనపై ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి స్పందించారు. తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు, ప్రతిదాడులకు పాల్పడవద్దని సూచించారు.






