2 September, 2026 | 2:57 AM

వెయ్యి రోజులు.. వెయ్యి తిప్పలు

02-09-2026 | 01:07am
  1. నెరవేరిన హామీలెన్ని, గ్యారెంటీలెన్ని?  
  2. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధాలు 
  3. నల్లగొండకు వెళ్లకుండా నన్ను నిర్బంధించారు
  4. అరెస్టులు, కేసులతో పోరాటాన్ని ఆపలేరు 
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు     
  6. నితిన్ నబీన్ ఫోన్, పోరాటాలకు భరోసా 
  7. వెయ్యి రోజుల పాలనపై మహేశ్వర్ రెడ్డి చార్జ్‌షీట్
  8. అరెస్టులను ఖండించిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితరులు

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వెయ్యి రోజుల పాలన పూర్తయిందంటూ ‘ప్రజాపాలన(people governance)’పేరుతో ప్రచారం చేసుకుంటుందని, అయితే ఎన్నికల(elections) ముందు ఇచ్చిన హామీలు, గ్యారెంటీల్లో  ఎన్ని నెరవేర్చారో? చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు(N. Ramchander Rao) డిమాండ్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అత్యంత ఆందోళనకరమైన, దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటుందని, ప్రజలు వెయ్యి తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు(illegal cases) బనాయిస్తున్నారని, ఎమర్జెన్సీ కంటే భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇది ‘ప్రజాపాలన కాదు.. ప్రజా వంచన పాలన’ అని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా  బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లకుండా మంగళవారం ఆయనను పోలీసులు తార్నాకలో గృహ నిర్బంధం చేసి, అనంతరం గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్ వద్ద రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో నిర్బంధ పాలన నడుస్తోందని, మహబూబ్‌నగర్‌లో కాలేజీ విద్యార్థులపై లాఠీచార్జి చేశారని, పాలిటెక్నిక్ విద్యార్థులను అడ్డుకున్నారని, బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు.

ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, ప్రజలను ఏకం చేసి ప్రభుత్వంపై ‘ప్రజా పోరాటం’ సాగిస్తామని పేర్కొన్నారు. కాగా బీజేపీ కార్యాలయం, బీజేపీ నాయకులపై కాంగ్రెస్ దాడుల నేపథ్యంలో రాంచందర్‌రావుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ‘సడక్ సే సదన్ తక్’ కాంగ్రెస్‌పై పోరాటాలను కొనసాగించాలని ఆయన భరోసా ఇచ్చారు. 

వెయ్యి రోజులు అబద్ధాలు మోసాలు: బీజేఎల్పీ నేత ఏలేటి 

‘వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ‘వెయ్యి అబద్ధాలు మోసాలు’ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం.. కేవలం కుంభకోణాలు, అవినీతి పాలన మాత్రమే కొనసాగుతుంది’ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ చార్జ్‌షీట్ విడుదల చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను సీఎం రేవంత్ విస్మరించారని విమర్శించారు. అనంతరం నల్లగొండకు వెళ్లకుండా మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి మలక్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  

బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన బీజేపీ నాయకులను పరామర్శించేందుకు నల్లగొండకు వెళ్లకుండా  రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

ఇందిరమ్మ రాజ్యం ఇదేనా?: బండి సంజయ్, కేంద్రమంత్రి

దాడులు చేసే వారిని కాపాడుతూ పరామర్శకు వెళ్లే వారిని అరెస్ట్ చేయడమేంది? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేసిన వాళ్లపై చర్యలేవని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలను రిమాండ్ ఎందుకు చేయలేదన్నారు.  కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. 

ప్రజాస్వామ్యం ఖూనీ: ఎంపీ డీకే అరుణ

రాంచందర్‌రావు అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్చ అని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. బాధితులకు సంఘీభావం తెలపడానికి వెళ్లడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. 

సమగ్ర విచారణ జరపాలి : ఎమ్మెల్యే శంకర్

నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. మంగళవారం డీజీపీ కార్యాలయానికి  బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ రాష్ట్ర చీఫ్, నేతల అరెస్టును ఆయన ఖండించారు.