ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పేరును పరిశీలించాలి

28-09-2026 | 07:38pm

* టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌కు వట్టికూటి రామారావు గౌడ్‌ వినతి

* మూడు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం ఎమ్మెల్సీ అవకాశం కోరిన రామారావు గౌడ్

గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పేరును పరిశీలించి అవకాశం కల్పించాలని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌(TPCC State President Mahesh Kumar Goud)ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్‌ కోరారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి తన బయోడేటాను అందజేసి వినతిపత్రం సమర్పించారు.

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురం గ్రామానికి చెందిన రామారావు గౌడ్‌ మూడు దశాబ్దాలుగా విద్యార్థి, సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపినట్లు పేర్కొన్నారు. అలాగే పలు ఉద్యమాల్లో పాల్గొంటూ కేసులను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో పాటు, హైకోర్టు న్యాయవాదిగా, సుప్రీంకోర్టులో ఎన్‌రోల్డ్ అడ్వకేట్‌గా కొనసాగుతున్నట్లు వివరించారు. జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నట్లు తెలిపారు. వివిధ సామాజిక, వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలంగా పనిచేసిన తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి తన పేరును పరిశీలించాలని టీపీసీసీ అధ్యక్షుడిని కోరినట్లు రామారావు గౌడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదు సత్యం గౌడ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు