8 March, 2026 | 5:02 AM

ఇర్కిగూడెంలో చారిత్రక ఆనవాళ్లు!

08-03-2026 01:45 AM

ఇర్కిగూడెం దామెరచర్ల మండలం నల్లగొండ జిల్లాలో వుంది. కృష్ణానది తీ రంలో ప్రసిద్ధమైన ఓడరేవు, చారిత్రక ప్రదేశం వాడపల్లికి సమీపంలో, నల్లగొండకు 70 కి.మీ.లు, మిర్యాలగూడకు 26 కి.మీ.ల దూరం లో వుంది ఇర్కిగూడెం. 1,918 ఎకరాల్లో విస్తరించి వుంది వూరు. 1,500 మంది ప్రజలు, 380 ఇండ్లల్లో నివసిస్తున్నారు. ఈ గ్రామానికి ఒక పాటిగడ్డ(పాతవూరు అడుగు) వుంది. అక్కడ కోట వంటి నిర్మాణం అవశేషాలు, దేవాలయాల శిథిలాలు కనిపిస్తున్నాయి.

వైష్ణవాలయం

శిథిలమైన వైష్ణవ దేవాలయమొకటి ఈ ఊరిలో వుంది. ద్వారపాలకులను బట్టి ఇది వైష్ణవ సంబంధమైన గుడి అని గుర్తుపట్టొచ్చు. 

లక్ష్మీనరసింహస్వామి దేవాలయం: మరొకచోట వాడపల్లిలో వున్నట్లే ఇక్కడ ఒకప్పుడు లక్ష్మీనరసింహస్వామి దేవాలయముండేదనడానికి నిదర్శనంగా లక్ష్మీనరసింహస్వామి శిథిలవిగ్రహం ఇక్కడే గుడిగోడల బయట పెట్టి కనపడుతున్నది. 

వీరగల్లులు, విడి శిల్పాలు: అక్కడ పడివున్న అనేక శిల్పాలలో కొన్నింటిని గుర్తించగ లం. ఒక వీరగల్లు, చాముండ దేవతను కలిపి ఒకచోట నిలిపివుంచారు. విరిగిన ఎర్రరాతిఫలకం మీద చెక్కిన భక్తహనుమాన్ విగ్రహం ఈ పరిసరాల్లోనే వుంది. ఒకచోట గోడలకు ఆన్చి నిలిపి పెట్టిన తలలేని స్త్రీమూర్తి విగ్రహం అద్భుతశిల్పం. కంఠహారాలు, కుచబంధం, ఘనమైన మేఖల, చీరెకట్టు హోయసలశైలిలో కనిపిస్తున్న ఈ శిల్పం కళ్యాణీచాళుక్యుల కాలంనాటి శిల్పం. వీరగల్లులోని జారుడు ముడివేసిన జుట్టున్న వీరునికి కంఠహారాలు, భుజకిరీటాలు, చేతిలో ఖడ్గం వున్నాయి.

శిల్పశైలిని బట్టి వీరుడు కళ్యాణీ చాళుక్యుల కాలానికి చెందినవాడు కావాలి. చాముండ విగ్రహం ముక్కలై వుంది. రూపురేఖలు భిన్నమై పోయాయి. రాతిబండలకు ఒరిగించి పెట్టిన విరిగిన అందమైన శిల్పాలలో స్తూపకిరీటమున్న తల, వెనక ప్రభావళి, సర్వాలంకార భూషితమైన ఉపరిభాగము ముండ్ల పొదల వెనక వున్నాయి. వీరభద్రుని వంటి రూపం, స్తూపకిరీటంతో వున్న ద్విభుజ విగ్రహం. కుడిచేత ఖడ్గం ధరించి వీరరూపంలో వున్నాడు. చెక్కిళ్ళు దాటుతున్న మీసాలు, కుండలాలు, హార, కేయూరాలు, మేఖల, కడియాలు, కంకణాలు అలంకరించబడి వున్నాయి.

ధనుస్సు వంటి కనుబొమ్మలు, విశాలనేత్రాలు, పక్కన ఇద్దరు దేవేరులు కుడి, ఎడమ చేతుల్లో పానపాత్రలు, వింజామరలు ధరించివున్నారు. యుద్ధంలో మరణించిన భర్తతో సహగమనం చేసిన భార్యలున్నారు. ఇదొక సతిశిల.   ప్రజ లు వీరభద్రుడని అంటున్నారు. ఇంకొకచోట వీరగల్లు వీరుడు, అతని సతీమణితో కనిపిస్తున్నది. వీరుని సిగ, ఆమె తలకట్టు, చెవి కుండలాలు, దుస్తుల కట్టు ఇవి ఈ వీరగల్లు 7,8 శతాబ్దాలనాటిదేమోననిపిస్తున్నది. ఇది కూడా సతిశిలే. ఇంకొక వీరగల్లులో వీరుడొక్కడే వున్నాడు. రెండుచేతుల్లో రెండు కత్తి, కటారు ధరించివున్నాడు.

కోట ఆనవాళ్లు

గోడకూలి రాళ్లబాట లాగా కనిపిస్తున్న కోట ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. శాసనాధారాలు దొరికితే ఈ చారిత్రక గ్రామానికి చరిత్రలో నిలిపే ఊతం లభిస్తుంది.