డీ లిమిటేషన్‌లో సమన్యాయం ఎలా?
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశం లో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర గందరగోళం నెలకొల్పుతోంది. దేశాభివృద్ధి కోసం జనాభా నియంత్రణ పాటిం చిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన గుదిబండగా మారబోతోందనే ఆందోళన ప్రారంభమైంది. దేశ సంక్షే మం కోసం జనాభా నియంత్రణను పా టించిన దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గా లు తగ్గడం శాపమయ్యిందని దక్షిణాది రా ష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.
జనా భా ప్రాతిపదికన కాకుండా నియోజకవర్గాల పునర్విభజన ఇతర మార్గాల్లో చేపట్టి, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని వారు కోరుతున్నారు. జనాభా లెక్కలతో చట్టసభలకు ప్రాతినిధ్యం పద్ధతి దేశ సమా ఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించనుందనే ఆందోళన దక్షిణ భారతదేశంలో ప్రారంభమైంది. ఈ నిర్ణయంతో 140 కోట్ల జనా భా ఉన్న భారత దేశంలో జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గుతుండగా, జనాభా నియం త్రణను పట్టించుకోని ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరగనున్నాయి.
వ్యతిరేకిస్తున్న దక్షిణాది సీఎంలు
నియోజకవర్గాల పునర్విభజనలో పోలి స్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తొలుత తమిళనాడు సీఎం స్టాలిన్, అనంతరం కేరళ సీఎం పినరాయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీ నేత చంద్రబాబు కూడా ఈ అంశంపై పరోక్షంగా స్పందిస్తూ ఆం ధ్రప్రదేశ్‌లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించాలని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజనతో లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గడ మే కాకుండా, కేంద్రం నుండి వచ్చే నిధుల్లో కూడా కోత పడుతుందనే అభద్రతాభావం దక్షిణాది ప్రభుత్వా ల్లో నెలకొంది.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఆధారపడితే అన్యాయం జరుగుతుందనే దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలో న్యాయం ఉంది. ఎంపీ స్థానాలు తగ్గితే, అత్యున్నత విధాన నిర్ణాయక సభల్లో ప్రాతినిధ్యం తగ్గి, కీలక నిర్ణయాల్లో అన్యాయం జరుగుతుందని దక్షిణాది నేతలు కలత చెందుతున్నారు. మంచి సంకల్పంతో కఠినంగా అమలు చేసిన జనాభా నియంత్రణ గొడలిపెట్టుగా మారితే భవిష్యత్‌లో మంచి పనులు చేపట్టడానికి దక్షిణాది రాష్ట్రాలే కాదు దేశం లోని ఇతర రాష్ట్రాలు కూడా వెనుకంజ వేయడం ఖాయం.
ఉత్తరాదిలో అధిక సంతనోత్పత్తి రేటు
దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారత దేశంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో తగ్గుదల కనిపిస్తుంది. 2019-21లో దేశంలోని అత్యల్పంగా తమిళనా డు, పశ్చిమ బెంగాల్‌లో సంతానోత్పత్తి రేటు 1.4 ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్, హిమచల్ ప్రదేశ్‌లలో ఇది 1.5గా నమోదైనట్టు భారత రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ద్వారా తెలుస్తుంది. అదే సమయంలో బీహార్ (3), ఉత్తరప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సం తానోత్పత్తి రేటు అధికంగా నమోదవుతోం ది. ఈ నేపథ్యంలో 2026లో జనాభా లెక్క ల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుండడంతో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నియోజ కవర్గాలు పెరిగే అవకాశాలుండగా, తమిళ నాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీట్లలో కోత పడనుందనే ప్రచారంతో దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన బాట పడుతున్నాయి.
స్పష్టత లేని కేంద్రం ప్రకటనలు
పునర్విభజనతో లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గుతాయని దక్షిణ రాష్ట్రాల నేతలు నిరసనలు తెలుపుతుండడంతో ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గవని వ్యాఖ్యానించారు. గతంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా పార్లమెంట్‌లో డీఎంకే ఇదే అంశాన్ని ప్రస్తావించగా అలాంటి సమస్య ఉత్పన్నం కాదని స్వయాన ప్రధాని నరేం ద్ర మోదీ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల నుం డి వస్తున్న ఒత్తిడితో ఇక్కడ సీట్లు తగ్గవని, ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా, ఉత్తరాది రాష్ట్రా ల్లో సీట్లు పెరుగుతాయా..? లేదా..? అనేదానిపై స్పష్టత లేదు.
సీట్ల పునర్విభజనపై ఇంత ఆందోళన నెలకొన్నా కేంద్రం నుండి స్పష్టమైన నిర్ణయం వెలువడం లేదు. అన్నీ తాత్కాలిక ప్రకటనలే వస్తున్నాయి తప్ప, అసలు నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు చేపడుతున్నారో, ఏ ప్రాతిపదికన చేపడుతున్నారనే అంశాల పై నిర్దిష్టమైన స్పష్టత రానంతకాలం ఈ ఆందోళనలు, గందరగోళాలు కొనసాగుతూనే ఉంటాయి. జనగణన ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సం ఖ్య మార్పు ఉంటుందని భారత రాజ్యాంగం చెబుతుంది. దీన్ని అనుసరించే 1951, 1961, 1971 సంవ త్సరాల్లో జనాభా లెక్కల ఆధారం గా లోక్‌సభ, రాజ్యసభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, నియోజకవర్గా ల పరిధులు మారాయి.
అయితే 1976లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణతో పునర్విభజన ప్రక్రియను ఆపేశారు. 2009లో పునర్విభజన ప్రక్రియ మళ్లీ చేపట్టినా కేవలం నియోజకవర్గాల పరిధులలో మార్పులు చేర్పులు జరిగాయి. జనాభా పెరుగుదలలో సమతుల్యం లేకపోవడం గందరగో ళానికి, సమస్యలకు దారితీస్తోం ది. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో ఒక ఎంపీ సగటున 30 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుం టే, తమిళనా డులో సుమారు 18 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో సమ తుల్యం దెబ్బతింటోంది.
పదిలక్షలా, 20 లక్షలా?
కోవిడ్ మహమ్మారితో పాటు వివిధ కారణాలతో దేశంలో ప్రస్తుతం సమయానికి జనగణన చేపట్టలేదు. అయితే వివిధ సంస్థల లెక్కల ప్రకారం ప్రస్తుత దేశ జనా భా 140 కోట్లు దాటింది. 2009లో పునర్విభజన జరిగినా సీట్ల సంఖ్య మాత్రం మారలేదు. 1977 లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గానికి 10 లక్షల వరకు జనా భా ఉండాలంటే ప్రస్తుతమున్న 543 స్థా నాలు సుమారు 1400 అవుతాయి. ఈ లె క్కన సుమారుగా యూపీలో 250, బీహార్‌లో 82 స్థానాలుంటాయి. తమిళనాడు లో 82 అవుతాయి. అలా కాకుండా 1977 లెక్కల్లో మార్పులు చేసి 20 లక్షలకు ఒక నియోజకవర్గం అంటే దేశంలో లోక్‌సభ స్థానాలు దాదాపు 700 లకు చేరుతాయి.
అప్పుడు యూపీలో 126, తమిళనాడులో ఇప్పుడున్న 39లో మా ర్పుండదు. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో 888 మంది ఎంపీలకు సీటింగ్ వ్యవస్థ ఉంది. దీంతో పాటు ఇటీవల తమిళనాడుతో సహా దక్షిణాదిలో సీట్లు తగ్గవనే అమిత్‌షా ప్రకటన చూస్తే 20 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయవచ్చు. జనాభా నియంత్రణ పాటిం చి దేశ నిర్మాణంలో సహకరించిన దక్షిణాది రాష్ట్రాల కృషిని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.
1951లో దక్షిణాది రాష్ట్రా ల జనాభా వాటా సుమారు 26 శాతం ఉండగా, 2022 నాటికి అది సుమారు 19 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వాటా సుమా రు 43 శాతానికి పెరిగింది. ఈ లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్, బీహార్ రెండు రాష్ట్రాలనే తీసుకుంటే సుమారు 225 సీట్లు ఉండవచ్చు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 170 లోపు సీట్లే ఉంటాయి. ఈ లెక్కలు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారనున్న నేప థ్యంలో జనాభా కట్టడి చేసిన రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తూ కేంద్రg అందరికీ ఆమోదమయ్యేలా నూతన మార్గాలను అన్వేషిం చాలి.
దేశంలో మాకు అన్యాయం జరుగుతుందనే భావన ఏ ప్రాంతం వారికొచ్చినా అది అనవసరమైన గందరగోళం తో పాటు అసంతృప్తికి దారితీస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన ఒకసారి జరిగితే దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలుండడంతో బాధిత రాష్ట్రాలు ఆందో ళన వ్యక్తం చేయడంలో న్యాయం ఉంది. అనేక అపోహలకు తావిస్తున్న ఈ కీలకాంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో అందరికీ సమన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకొని గందరగోళానికి ముగింపు పలకాలి.
-ఐ.వి.మురళీకృష్ణ శర్మ






