26 April, 2026 | 2:23 PM

తెలుగులో బోధన చారిత్రక అవసరం

02-03-2025 12:00 AM

తెలంగాణ రాష్ట్రం లోని సిబిఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ వంటి అన్ని బోర్డుల పరిధిలోని పాఠశాలలలో తెలుగు తప్పని సరి గా తొమ్మిది, పది తరగతుల వరకు బోధించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ముదావహం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీ య విద్యాలయాల్లో, ఇంకా అనేక  ఆంగ్ల మాధ్యమం లో నడిచే కార్పోరేట్ పాఠశాలలలో పదవతరగతి వరకు తెలుగును అభ్యసించకుం డా సర్టిఫికెట్‌లు పొందుతున్నారు .

తెలుగు మాతృ భాష కాని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం, విద్యా శాఖ,  రాష్ట్ర శిక్షణ, పరిశోధన సంస్థ (ఎస్సీ ఆర్టీఈ) సులభశైలిలో పుస్తకాలు ప్రచురించినా తెలుగు భాషపై నిర్లక్ష్య, నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వం హయాం లో తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినా సరైన పర్యవేక్షణ, అమలు చేయడం లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఉత్తర్వులు పేపర్ల వరకే పరిమి తం అయ్యాయని అనేక మంది ఉపాధ్యాయులు, తెలుగు భాషాభిమానులు ఆందో ళన వ్యక్తం చేశారు.

మాతృభాషలో చదవడం వల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం ,స్వీయ వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతాయని అనేక విద్యా కమిటీలు, విద్యా కమిషన్‌లు ప్రభుత్వానికి సూచనలు చేసి రిపోర్టులు సమర్పించాయి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళ నాడు, మహారాష్ట్ర మిగతా రాష్ట్రాలలో, పొరుగు దేశాలైన చైనా, జపాన్, రష్యా, దక్షిణ కొరియాతో పాటు ఐరోపా దేశాలన్నిటిలో కేజీనుండి పీజీ వరకు మాతృ భాషలో విద్యను అభ్యసించి శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక, వైద్య, న్యాయ, ఇంజనీరింగ్ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారు. ఇంట్లో మాతృభాషను మాట్లాడు తూ బడులలో ఆంగ్లంలోనే మాట్లాడాలనే నిబంధనలు పెట్టడంతో అనేక మంది మానసిక ఒత్తిడికి, మానసిక క్షోభకు గురౌతున్నారు. ఆంగ్లభాషపై అభిమానం ఉంటే ఉండవచ్చు కాని మాతృభాష పైన మమకారం, అనుబంధం మాత్రం మరిచిపోవ డం ఆందోళనకరమైన విషయం.

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధా నం (న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020)లో మాతృభాషకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వ డం జరిగింది. మాతృభాష తెలుగును రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లి. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి యునె స్కో తమ సర్వేలో తెలుగు మృత భాషలో చేరుతుందని హెచ్చరించింది. ఏ భాష అయితే ప్రజలు ఎక్కువ మాట్లడరో ఆ భాష మాతృభాషగా మారుతుంది. పొరు గు రాష్ట్రాలలో, పొరుగు దేశాలలో దుకాణాల మీద, పరిపాలన వ్యవహారాలలో మాతృభాషకే ప్రాధాన్యత ఇస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆంగ్ల మాధ్యమంలో బోర్డులను పెడ్తున్నారు.

ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కలిసినా హిం దీ, ఆంగ్లం మాట్లాడుతారనే అపవాదం ఉంది. తెలుగు వినబడాలి, తెలుగు కనబడాలి అని అధికారులు, నాయకులు ప్రకట నలకే పరిమితం చేస్తున్నారు. కేంద్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక విద్యా సంస్థలలో తెలుగు మాతృభాషను అమ లు చేయడం లేదు.

పరిపాలన, న్యాయ పరమైన విధానాలలో తెలుగును అమలు చేయాలి.న్యాయ, వైద్య, వైజ్ఞానిక, ఇంజనీరింగ్ పుస్తకాలను తెలుగులో అనువాదం చేసి తెలుగు మాతృభాష కలిగిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. న్యాయ, పరిపాలన వ్యవహారాలు ఆంగ్లంలో ఉండ డం వల్ల అనేక మందికి అర్థం కాక కొంత మంది చదువుకున్న వారికే పరిమితం అవుతున్నాయి. కొంతమంది న్యాయమూర్తులు, ఉన్నత అధికారులు ఇటీవల న్యా య, పరిపాలన ఉత్తర్వులు తెలుగులో వెలువరించి చారిత్రాత్మక విషయాలుగా ప్రజల మన్ననలు పొందుతున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని విద్యామిషన్‌లు, విద్యా కమిటీలు ప్రతిపాదనలు చేశాయి.తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యాబోధన చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో  ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయడానికి తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్టే ను విధించింది. గత ప్రభుత్వం తెలంగాణలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడంతో అనేక తెలుగు, హిందీ, ఉర్దూ మాతృభాష కలిగిన పాఠశాలలు మూతపడ్డాయి. 

ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు తెలుగు మాధ్యమంలో విద్యాబోధనకు ప్రొత్సాహం కలిగి స్తామని ప్రకటించడంతో ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది. హార్షాతి రేకాలు వెల్లువెత్తాయి.అనేక మాతృభాష తెలుగు, హిందీ, ఉర్దూ మాధ్యమాలలో పాఠశాలలను పునః ప్రారంభం చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.ఆదర్శ అమ్మ పాఠశాలల పేరిట నిధులను మంజూరు చేసి ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో మరమ్మతులు చేయించి నూతన శోభను తెచ్చారు. మాతృభాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఉభ య తెలుగు రాష్ట్రాలలో అధికారులు, నా యకులు చేస్తున్న కృషికి తోడ్పాటు అం దించాలి. తెలంగాణ రాష్ట్రంలోని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, ప్రయివేటు పాఠశాలలలో, కేంద్రీయ విద్యాల యాల్లో తెలుగు తప్పని సరిగా అమలు అయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా ప్రజలపై ఎంతో ఉంది.

మాతృభాషపై పట్టు అత్యవసరం

ప్రపంచం కుగ్రామంగా మారిన నేటి పరిస్థితుల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయటం అవసరమా? అనే వాదన వినిపిస్తోంది. తెలుగు మాతృభాషలో పట్టున్న వాళ్ళు ప్రపంచం లోని ఏ భాషనైనా సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తెలుగులో విద్యాభ్యాసం చేసిన అనేక మంది విద్య, వైద్య, పారిశ్రామిక, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, రాజకీయ రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించారు .ఉన్నతోన్నత ఉద్యోగాలను, పదవులను ఎంతో నై పుణ్యంతో నిర్వహించారు. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలలో ఐదు మార్కులను గ్రేస్ మార్కులుగా కలపాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగ అవకాశాలు అనే అపవాదును దూరం చేసి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలో అనేక ఉద్యోగ అవకాశాలు మంచి వేతనంతో ఉన్నాయనే విషయాన్ని తెలియజే యాలి. మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో వారి మాతృభాష పరిరక్షణ కోసం ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది.అదే విధంగా తెలుగు అమలు కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.తెలుగు మాతృభాషను అమలు చేయడం వల్ల ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలకు పెద్ద పీట దక్కుతుంది. తెలుగు కు కేంద్ర ప్రభుత్వం  ప్రాచీన హోదా గౌర వం ఇవ్వడం వలన తెలుగుభాష, సంస్కృ తి, సంప్రదాయాలు, పరిశోధనలు, అనేక మంది కవుల రచనలు ప్రచురించడానికి అవకాశం ఉంది.

డా. ఎస్. విజయ భాస్కర్