26 April, 2026 | 11:10 AM

కలమై.. కుంచెయై.. శీలావీయై!

03-03-2025 12:00 AM

అతని కలంలో సిరా

రంగులై చింది

చిత్రకళా వైభవమై 

సాక్షత్కరించింది.

అతని కుంచె

సిరాక్షరాలుగా 

లిఖించిన కవితై 

వీరంగ మేసింది.

నెమ్మదనంలోనే 

ప్రవాహగుణం 

లయగా, వచనమెన్ని 

పాయలుగా 

ఉరకలెత్తిందో..

కవుల ముఖచిత్రమై 

భాసించిందీ చరిత్రే

ఫ్రీవర్స్ ఫ్రంట్, 

నొక్కు పడని జ్ఞాపిక (ం)

ప్రయోగశీలత, 

సౌందర్యారాధన 

రెండుకళ్ళలో 

వైవిధ్య దృక్పథాలు

శిల్పాల కళాత్మకత, 

గ్రంథాల భావుకత,

చిత్రాల ఆశ్చర్య చకితం, 

మంద్ర సంగీత లహరులు,

కిచకిచ రాగాలు, 

ఒలికిన వర్ణాలు, 

అల్లుకునే ఊహలు, 

మృదు భాషణలు,

ప్రేమ తడి పలకరింపులు 

విహరించే గృహసీమను 

దర్శించిన యాది

తన చివరి సృజన పదనుగా 

నా కళ్ళలో- మూడక్షరాల 

వర్ణాత్మక, కవితాత్మక సంతకం 

‘గోరుకొయ్యలై’ గట్టి అక్షరం 

రాయమంటూనే!

(శీలా వీర్రాజు గుర్తొచ్చి..)

 -దాసరాజు రామారావు