బడ్జెట్‌లో గ్యారెంటీలకు దక్కేదెంత?
డాక్టర్ తిరుణహరి శేషు :
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టబోతున్న మూడో పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు ఈసారైనా నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో గ్యారెంటీలను అమలులోకి తెస్తారా? లేదా అనే అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను వంద రోజులలో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఇంటింటికీ వెళ్లి గ్యారెంటీ కార్డులను కూడా పంపిణీ చేసింది.
గ్యారెంటీల పుణ్యమా.. అని ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. పాలనా పగ్గాలు చేపట్టి ఇప్పటికి 28 నెలలు అవుతున్నది. అయినా, ఆరు గ్యారెంటీలు హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. సర్కార్ ఎప్పటికప్పుడు కప్పదాటు వైఖరి అనుసరిస్తూ వస్తుండటంతో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా ఓట్లుగా మలు చుకోవటానికి ‘అభయ హస్తం’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించి అధికారాన్ని చేజిక్కించుకుంది.
పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయటానికి 70 నుంచి 80 వేల కోట్ల రూ పాయల నిధులను బడ్జెట్‌లో కేటాయించాలి. కానీ..2024---25 బడ్జెట్ లో 49 వేల కోట్ల రూపాయలను (మొత్తం బడ్జెట్ లో 17 శాతం) 2025- - 26 బడ్జెట్‌లో 56 వేల కోట్ల రూపాయల (17.4 శాతం) నిధులను మాత్రమే కేటాయించింది. కేటాయించిన ఆ నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవటం వల్ల మహాలక్ష్మి, రైతుభరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువవికాసం లాంటి ఏ ఒక్క గ్యారెంటీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అ మలు చేయలేకపోయింది.
రైతులకేది భరోసా?
రాష్ర్టం వచ్చిన నాటి నుంచి అప్పటి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తూ వచ్చింది. రైతుబంధు పేరిట అమలైన ఈ పథకంలో లోపాలు ఉన్నా, ఇతర రాష్ట్రాలకే కాదు దేశానికే ఆదర్శంగా నిలిచింది. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రైతుభరోసా కూడా ఒకటి. రైతుబంధుకు ఇది కాంగ్రెస్‌కు రూపం. వరంగల్ రైతు డిక్లరేషన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు ద్వారా రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని రూ. పదివేల నుంచి రూ.15వేలకు పెంచుతామనే హామీతో పాటు, రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద ప్రతి సంవత్సరం రూ.12 వేల ఆర్థిక సహాయం, ఎంపిక చేసిన పంటలకి బోనస్ ఇస్తామనే మూడు కీలకమైన హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
కానీ, హామీల్లో ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోయింది. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుబంధు పథకం పేరు మార్చి రైతు భరోసా పేరుతో హామీ ఇచ్చిన మేరకు ఎకరాకు రూ.15 వేలు కాకుండా కేవలం రూ.12 వేల పెట్టుబడి సహాయాన్ని పెంచి ఒక్క సీజన్‌కి మాత్రమే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో నాలుగు సీజన్‌లకి 32 వేల కోట్ల రూపాయలను రైతులకి అందించాలి.
కానీ, రెండు సీజన్లకు రూ.16,500 కోట్లను మాత్రమే విడుదల చేసింది. మరో రూ.16 వేల కోట్ల ప్రభుత్వం రైతుల ఖాతాలోకి జమ చేయనేలేదు. అంటే.. ఈ మొత్తం దరిదాపు ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ రూ.21 వేల కోట్లకు సమానం. గత రెండు బడ్జెట్లలో రైతుభరోసాకి రూ.33,705 కోట్లు కేటాయించి రూ.16,500 కోట్లను మాత్రమే రైతులకు పంపిణీ చేసింది.
500 రూపాయల బోనస్‌ని ఒక్క వరికి, అదీ సన్నాలకి మాత్రమే పరిమితం చేసింది. అలాగే రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా కింద సంవత్సరానికి రూ.12 వేల చెల్లించటానికి రెండు బడ్జెట్లలో రూ.1,506 కోట్లు కేటాయించి కూడా, రాష్ర్టంలో ఏ ఒక్క రైతు కూలీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.
వృద్ధులకు చేయూత ఏది?
ఆరు గ్యారంటీల్లో ఒకటి పండుటాకులకు, దివ్యాంగులకు చేయూతనందించే గ్యారెంటీ కూడా అమలులోకి రాలేదు. రాష్ర్టంలో ఉన్న 45 లక్షల మంది చేయూత లబ్ధిదారులు, 5 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ పెంపు కోసం రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం పెన్షన్‌ని రూ.2 వేల నుండి రూ.4 వేలకు పెంచి లబ్ధిదారులకు అందజేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అమలు చేయడం లేదు.
ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పెన్షన్ రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచాల్సి ఉంది. ఆ హామీ నెరవేర్చకపోవడంతో ఆ యా వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పెన్షనర్లకు ఇచ్చి హామీ మేరకు.. ప్రతి పెన్షనుదారుకు ప్రభుత్వం రూ.54 వేల చొప్పున బాకీ పడింది. ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవంత్‌రెడ్డి ‘ఒక్క నెల ఆగండి.. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది.
మీకు రూ.4 వేల పెన్షన్ ఇస్తుంది’ అని చెప్పిన మాట కార్యరూపం దాల్చకపోవటం వలన ప్రభుత్వం తన విశ్వసనీయతను పోగొట్టుకుందనే భావన వ్యక్తమవుతున్నది. 57 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ పెన్షన్ ఇస్తామనే హామీతో పెన్షన్ లబ్ధిదారుల సం ఖ్య పెరగాలి. కానీ, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి న ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం వలన వేలాదిమంది లబ్ధిదారులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు.
చేయూత పెన్ష న్ అమలు చేయటానికి రూ.22 వేల కోట్లు అవసరమవుతాయని గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రతిపాదనలు పంపితే, గత బడ్జెట్ లో చేయూత పథకానికి రూ.14,861 కోట్లు మాత్రమే కేటాయించి పండుటాకుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందనే చెప్పాలి.
కళ తప్పిన మహాలక్ష్మి
మహిళలను కోటీశ్వరులను చేస్తామని అదానీలుగా, అంబానీలుగా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మహాలక్ష్మి గ్యారంటీలో అ త్యంత కీలకమైన నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం హామీని ఎందుకు అమలు చేయ టం లేదు. ఉచిత బస్సు ప్రయాణం మహిళల జీవితాలలో వెలుగులు నింపుతుందని, వారి జీవితాలనే మార్చి వేసిందని ప్రభుత్వం చెబుతున్న మాట ‘నేతి బీరకాయలో నెయ్యి’ చందంగా ఉన్నది.
గ్యాస్ రాయితీ ఎంత తమ అకౌంట్లోకి వస్తుందో లబ్ధిదారుడికే తెలవటం లేదు. ఉచిత బస్సు సౌకర్యం ద్వా రా మహిళలకు కలిగే ప్రయోజనం కూడా స్వల్పమే. మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ప్రతినెలా ఆ ప్రభుత్వాలు మహిళల ఖాతా లో డబ్బులు జమ చేస్తుంటే, తెలుగు రాష్ట్రా లు మాత్రం హామీ ఇచ్చి మహిళలను మోసం చేశాయని ఇక్కడి మహిళలు భావిస్తున్నారు.
పేదవాడి సొంత ఇంటి కల కలే
గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆశ చూపించింది. కొందరికే ఇళ్లు కట్టించింది. నేటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇచ్చిన హామీ ప్రకారం, సర్కార్ ఇప్పటికే రాష్ర్టంలో 8 లక్షల ఇళ్ళను నిర్మించాలి. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో కనీసం 2 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. సొంత ఇంటి స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు అనే నిబంధన కారణంగా, నిజమైన పేదవాడికి ఇల్లు దక్కలేదు.
ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతో ఇళ్ల నిర్మాణం పూర్తికాక లబ్ధిదారులు అప్పుల పాలవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రెండు బడ్జెట్లలో రూ.20,311 కోట్లు కేటాయించారు. కానీ, ఆ నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. ఆరు గ్యారెంటీలను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో విడుదల చేసే వేదికపై దక్షిణ తెలంగాణకు చెందిన ఒక మంత్రి చేయూత పెన్షన్ల పెంపు గురించి తీవ్ర స్వరంతో నాటి ప్రభుత్వాధినేతను పరుషం గా విమర్శించారు. కానీ.. నేటి ప్రభుత్వాన్ని ఎవరు.. ఎందుకు నిలదీయడం లేదు. అంటే రాజకీయం ఒక మాయా జూదం, నాయకుల మాట విశ్వాసం లేని ఒక గ్యారెంటీ అని ప్రజలు రాజీ పడాలేమో!
వ్యాసకర్త సెల్: 9885465877




