ఇరాన్ వ్యూహాలకు అమెరికా వెలవెల
డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి :
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల మంటలు పరాకాష్టకు చేరాయి. ఫిబ్రవరి 28 రోజున ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని అమెరికా హతమార్చిన నాటి నుంచి అమెరికా -ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం లో అగ్రరాజ్యమే అధికంగా ఆస్తి, ప్రాణ నష్టాలను మూటకట్టుకున్నది. నేడు ఇరాన్ యుద్ధ వ్యూహాల ముందు అమెరికా-, ఇజ్రాయెల్ దేశాల అత్యాధునిక ఆయుధాలు వెల వెలబోతున్నాయి.
కేవలం ఆయుధ సంపత్తి కన్నా, పక్కా వ్యూహాలే విజయాన్ని తెస్తాయని ఇరాన్ రుజువు చేస్తున్నది. యుద్ధ తీవ్రత పెరిగిన కొద్దీ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. ముఖ్యం గా గ్యాస్ సిలిండర్ కొరతతో పర్యాటకం, హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారం దెబ్బతింటున్నది. హోర్ముజ్ జలసంధి గుండా సాగే చ మురు, ఎల్‌పీజీ రవాణాను ఇరాన్ అడ్డుకోవడం ద్వారా ప్రపంచ దేశాలకు ఇంధన కొర త వస్తున్నది. అలా అమెరికాపై ఒత్తిడి పెంచ డం ఇరాన్ ప్రధాన ఎత్తుగడగా కనిపిస్తున్నది.
తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ బాంబులను ప్రయోగిస్తూ, వాటిని అడ్డుకునేందుకు అమెరికా, -ఇజ్రాయెల్ ఖరీదైన క్షిపణులను వాడేలా పురికొల్పడం వంటి ఇరాన్ వ్యూహా లు అగ్రరాజ్యానికి చెమటలు పుట్టిస్తున్నా యి. యుద్ధంలో ఎవరు గెలిచినా, ఓడినా సామాన్య ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తున్నది. చమురు, గ్యాస్‌సిలిండర్ సరఫరా ఆగిపోవడంతో నేడు వంటిళ్లు చిన్నబోతున్నాయి.
బెడిసికొట్టిన అమెరికా వ్యూహాలు
వెనిజులాలో జనవరి 3న ఆ దేశాధినేత నికోలస్ మదురోను నిర్బంధించిన అమెరికా, అక్కడ తన కీలుబొమ్మకు పాలన పగ్గా లు కట్టబెట్టిన తరహాలోనే ఇరాన్‌లోనూ చే యాలని భావించింది. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధాన్ని ప్రారంభించాయి. తమకు వ్యతిరేకంగా పాలన సాగి స్తున్న అలీ ఖమేనీని హతమార్చి, ఆయన స్థానంలో తమకు నచ్చిన పాలకుడిని సుప్రీం లీడర్‌గా నియమించాలని కలలు క న్న అగ్రరాజ్య వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయి.
యుద్ధం తొలి రోజు ఖమేనీని మట్టుబెట్టి విజయం సాధించామని ప్రకటించిన అమెరికా-, ఇజ్రాయెల్‌కు, ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ప్రతిఘటన ఆచితూచి అడుగులు వేసేలా చేస్తోంది. ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా గండి కొడుతోంది. కేవలం కొన్ని వేల డాలర్ల ఖర్చుతో ఇరాన్ తయారు చేస్తున్న ‘షాహెద్’ వంటి చవకైన డ్రోన్లను అడ్డుకోవడానికి, అమెరికా లక్షల డాలర్ల విలువైన అత్యాధునిక క్షిపణులను ప్రయోగించాల్సి వస్తోంది.
ఇలా తక్కువ ఖర్చుతో కూడిన దాడులతో శత్రువు చేత ఎక్కువ ఖ ర్చు పెట్టించడం ద్వారా అగ్రరాజ్యాన్ని ఆర్థికంగా బలహీనపరచడంలో ఇరాన్ విజ యం సాధిస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల అమెరికా రోజుకు సుమారు 2 బిలియ న్ డాలర్ల మేర ఖర్చు చేస్తోందని, కేవలం మొదటి వారంలోనే రూ. 51 వేల కోట్ల న ష్టం వాటిల్లిందని అంచనాలు చెబుతున్నాయి.
ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలను అమాంతం పెంచేస్తోంది. యుద్ధానికి ముందు 59 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ధర ప్రస్తుతం 120 డాలర్లకు చేరడం అమెరికా సహా ప్రపంచ దేశాల్లో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది.
అమెరికాకు చెందిన రూ. 22 వేల కోట్ల విలువైన ‘థాడ్’ రక్షణ వ్యవస్థలు, అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు మరియు డ్రోన్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం వల్ల అగ్రరాజ్యం ఆస్తి నష్టంతో పాటు రక్షణ బడ్జెట్ పరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక భారమే అమెరికాను ఈ యుద్ధంలో ఆత్మరక్షణలో పడేలా చేస్తోంది.
ఎదిరించే వ్యూహాత్మక శక్తి
అమెరికా, ఇజ్రాయెల్ వంటి అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశాలను ఎదిరించే శక్తిని ఇరాన్‌కు తన వ్యూహాలే ఇస్తున్నాయి. ప్రత్యక్ష యుద్ధం కంటే శత్రువును ఆర్థికంగా, మానసికముగా దెబ్బతీసే ‘అసిమ్మెట్రిక్ వార్‌ఫేర్’ను ఆ దేశం సమర్థవంతంగా అమలు చేస్తున్నది. హిజ్బుల్లా, హౌతీల వంటి సాయుధ సంస్థల ద్వారా తన శత్రువును చుట్టుముట్టడం ఇరాన్ వ్యూహం. ఒకవైపు హోర్ముజ్ జలసంధిని నియంత్రించే భౌగోళిక వెసులుబాటు ఉండటం ఇరాన్‌కు కలిసి వస్తున్నది.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, చమురు శుద్ధి కేంద్రాలనులక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులు, ప్రపంచానికి ఒక స్పష్టమైన హెచ్చరికను పంపుతున్నాయి. తమ దేశంపై దాడి జరిగితే, మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రయోజనాలు, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ కకావికలం అవుతాయని ఇరాన్ చాటిచెబుతున్నది.
గల్ఫ్ దేశాలలోని రిఫైనరీలపై దాడుల ద్వారా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలను పెంచి, పాశ్చాత్య దేశాల్లో ఆర్థిక సంక్షోభం సృష్టించగలమని నిరూపిస్తోంది. తమను ఒంటరిని చేయాలని చూస్తే, ప్రపంచ ఆర్థిక గమనాన్ని శాసించే ఇంధన సరఫరాను స్తంభింపజేస్తామనే ‘డెడ్లీ మెసేజ్’ను ఇరాన్ తన క్షిపణి దాడుల ద్వారా అమెరికాతోపాటు ఆ దేశ మిత్రదేశాలకు పంపుతున్నది.
తండ్రిని మించిన మొజ్తాబా ఖమేనీ
అలీ ఖమేనీ స్థానంలో సుప్రీం లీడర్‌గా ఎంపికైన ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ బలమైన నేతగా తన సత్తా చాటుతున్నారు. ఈ నూతన సుప్రీం లీడర్‌ను కూడా అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యుద్ధ నీతి నియమాలకు విరుద్ధంగా పాఠశాలలు, ఆసుపత్రులు, పౌర ఆవాసాలను సైతం లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.
అత్యంత ఖరీదైన అమెరికన్ ఎఫ్--15ఈ స్ట్రుక్ ఈగిల్ యుద్ధ విమానాలు, రూ.250 కోట్ల విలువైన ఎంక్యూ-9 రీపర్, థాడ్ రక్షణ వ్యవస్థల రాడార్ కేంద్రాలను ఇరాన్ డ్రోన్లు ధ్వంసం చేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా ప్రకటించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ద్వారా ఇరాన్ తలవంచుతుందని ఊహించినప్పటికీ, వాస్తవానికి అది క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఇరాన్ ఐఆర్‌జీసీ సైనిక బలగాలు రెండు దేశాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.
గ్లోబల్ ఫైర్‌పవర్ సూచికలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, ఇజ్రాయెల్ 15వ స్థానంలో, ఇరాన్ 16వ స్థానంలో ఉన్నాయి. హోర్ముజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్‌కు చెందిన 28 వ్యాపార నౌకలను సురక్షితంగా రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించి భారత్‌కు చెందిన కొన్ని నౌకలను ఇప్పటికే జలసంధి దాటించింది. అమెరికా డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఈ చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. నేడు యుద్ధ విరమణకు ఇరాన్ పెట్టిన మూడు షరతులు అగ్రరాజ్యానికి సంకటంగా మారాయి. ఇప్పటికైనా ప్రపంచ శాంతి కోసం చర్చల దిశగా అడుగులు పడాలని మానవాళి కోరుకుంటున్నది.
- వ్యాసకర్త సెల్: 99497 00037




