బూడిద సుధాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,
(విజయక్రాంతి) :
నేను ఈ రోజు ఆఫీసులో బాగా అలసిపోయాను. వంట చేసే ఓపిక లేదు. బయటి నుంచి బిర్యానీ ఆర్డర్ చేయండి. ఆలుమగలిద్దరు ఉద్యోగం చేస్తున్న కుటుంబాలలో నిత్యం వినబడే మాట ఇది.
అరే మామా ఎండలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం ఓ బీరు తాగి బిర్యానీ తిందాము..! నగరంలో రోజూ కలుసుకునే ఓ ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ ఇది.
నేను ఇక్కడి నుంచి బయల్దేరుతున్నాను. రాగానే ఏదైనా హోటల్‌లో హైదరాబాద్ ధమ్ బిర్యానీ తినొద్దాం. విదేశాల నుంచి వస్తున్న ఓ కొడుకు తన అమ్మతో చెప్పే మాటలివి.
ఈ రోజు ఆ డీల్ ఫైనల్ కావాలంటే బిర్యానీ ఉండాల్సిందే.. ఓ ఇద్దరు వ్యాపార భాగస్వాముల మధ్య జరిగిన చర్చ ఇది.
ఇవ్వాళ హాలీడే కదా.. మధ్యాహ్నం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ తినొద్దాం. వీకెండ్ రోజులలో నగరంలోని మెజార్టీ కుటుంబాల నిర్ణయం ఇది.
ఐ లవ్ హైదరాబాద్, ఐ లైక్ హైదరాబాద్ బిర్యానీ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు నగరానికి వస్తే అనే మాటలివి..
హైదరాబాద్ బిర్యానీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. స్విగ్గి, జొమాటో వంటి ఆన్‌లైన్ సేవలు విస్తృతం కావడంతో ఉదయం టిఫిన్ మొదలుకొని రాత్రి బిర్యానీ డిన్నర్ వరకు వంటకాలను ఇంటికి తెప్పించ్చుకుని రకరకాల రుచులను ఆస్వాదిస్తున్నారు. మూడు షిఫ్టులలో విధులు నిర్వహించే ఐటీ, మార్కెటింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ వంటి రంగాలలో పని చేస్తున్నవారు రోడ్‌సైడ్ స్ట్రీట్ ఫుడ్‌ను ఆరగించేస్తున్నారు.
ప్రజల డిమాండ్, అభిరుచులకు తగినట్లుగా హోటల్స్, ఆన్‌లైన్ సేవలు, స్ట్రీట్‌ఫుడ్ కోర్టులు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చౌక ధరలకే నచ్చిన రుచులు లభిస్తుండటంతో నగరం లో చాలా కుటుంబాలు కిచెన్ హాలి డేను ప్రకటిస్తున్నా రు. అయితే హోటల్స్, ఆన్‌లైన్, స్ట్రీట్‌ఫుడ్‌తో సమయం, శ్రమ ఆదా అవుతున్నప్పటికీ.. నాణ్యత లోపాల కారణంగా ఫుడ్‌ప్రియులకు అనర్థాలు కూడా కలిగే అవకాశం ఉందని వైద్యలు హెచ్చరిస్తున్నారు. దేశంలోనే నెంబర్ వన్ బిర్యానీ హబ్‌గా మారిన హైదరాబాద్‌లో హోటల్‌ఫుడ్, ఆన్‌లైన్ సేవలు, స్ట్రీట్ ఫుడ్ విస్తృతిపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.
నగరంలో మారుతున్న జీవనశైలి...
ఒకప్పుడు ఎక్కడికి వెళ్లినా ఇంట్లో అమ్మ వంటను వెంట తీసుకెళ్లేవారు. ఇప్పుడు నగర ప్రజల జీవనశైలి మారుతున్నది. పెరుగుతున్న అవసరాల రీత్యా భార్యాభర్తలు ఉద్యోగం చేయడం అనివార్యంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసి మళ్లీ వంట చేయలేమనే భావనతో ఉన్న మెజార్టీ కుటుంబాలు వారంలో రెండు మూడు సార్లు హోటల్ ఫుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓ ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు గతంలో ఇరానీ హోటళ్ళోనో చాయ్ బండి దగ్గరో చాయ్, బిస్కెట్ తింటూ పిచ్చాపాటిగా మాట్లాడుకునేవారు.
కానీ ప్రస్తుతం.. ఏదో ఒక రెస్టారెంట్‌లో బిర్యానీ తింటూ మాట్లాడు కుంటున్నారు. పిల్లలు, పెద్దలు, ఉద్యోగులు అనే తేడాలేదు. కమ్యూనిటీ మీటింగ్స్, ఫెస్టివల్స్, ఫ్రెండ్స్ పార్టీ ఇలా సందర్భం ఏదైనా.. హైదరాబాద్ బిర్యానీ రుచి చూస్తున్నారు. సెలవు దొరికిందంటే చాలు కుటుంబంతో కలిసి ఏదో హోటల్‌లో బిర్యానీతో పాటు నచ్చిన వంటకం రుచి చూస్తున్నారు. నగరంలోని హోటల్స్, ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా హైదరాబాద్ సిటీ ప్రజల అభిరుచులకు తగ్గట్లుగానే ఇంటి వంటకాలు మొదలుకొని అంతర్జాతీయ రుచులను సరఫరా చేస్తూ కస్టమర్లకు దగ్గరవుతున్నాయి.
విస్తృతమైన ఆన్‌లైన్ సేవలు
హైదరాబాద్‌లో స్విగ్గి, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు విస్తృతమ య్యాయి. ఇడ్లీ మొదలు.. బిర్యానీ వరకు, ఇండియన్ ఫుడ్ నుంచి చైనీస్ వరకు జస్ట్ క్లిక్ చేస్తే చాలు కోరుకున్న రుచులు క్షణాల్లో ఇంటి ముందుకు వస్తుండటంతో నగర ప్రజలు చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఐదు బిర్యానీలకు ఆర్డర్లు వస్తే ఇందులో ఒకటి లేదా రెండు బిర్యానీలు హైదరాబాద్ నుంచే ఆర్డర్ చేస్తున్నారని ఓ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ తమ వార్షిక నివేదికలో పేర్కొన్నది. వంట చేసుకునే తీరిక లేని వాళ్లు గతంలో హోటల్‌కు వెళ్లి తినేవాళ్లు.
కానీ హోటల్స్‌కు వెళ్లి వెయిట్ చేసే ఓపిక లేనివాళ్లు నచ్చిన వంటకాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 31వంటి ప్రత్యేక సందర్భాలలో ఒక్క నిముషంలో సుమారు 50వేల వరకు (అన్ని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలతో కలిసి) ఆన్‌లైన్ ఫుడ్ కోసం ఆర్డర్లు వస్తున్నట్లు ఆ సంస్థలు పేర్కొంటున్నారు. బిర్యానీతో పాటు బిర్యానీ రైస్, మినీ బిర్యానీల కోసం లక్షలలో ఆర్డర్లు వస్తున్నట్లు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడి నగరంలో సుమారు 50వేల మంది వరకు ప్రత్యక్షంగా, మరో 50వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
ఐటీ ప్రాంతాల్లో ఎక్కువ...
ఐటీ ఉద్యోగులు అత్యధికంగా ఉండే కూకట్‌పల్లి ప్రాంతంలో బిర్యానీల సేల్ ఎక్కవగా ఉన్నట్లు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, రాయదుర్గం ప్రాంతాల వాసులు ఆన్‌లైన్ ఫుడ్ కోసం ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. కాంబో ఆర్డర్‌లలో కూకట్‌పల్లి ముందుందని, నిముషానికి 200 చికెన్ బిర్యానీలు ఈ ప్రాంతం నుంచి ఆర్డర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉదయం, సాయంత్రం సమయంలో ఎక్కువగా మసాల దోశ ఆర్డర్‌లు కూడా వస్తున్నాయని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరి సంస్థలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.28 లక్షల బిర్యానీల ఆర్డర్లు వస్తుండగా, ఇందులో అత్యధికంగా హైదరాదబాద్ నుంచే వస్తున్నాయంటే నగరంలో ఆన్‌లైన్ ఫుడ్‌ప్రియుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చును.
వేరే నగరాల రుచులను ఆస్వాదించవచ్చు
ఓ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఇంటర్ సిటీ లెజెండ్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దేశంలోని ఇతర నగరాలలో ఉన్న రుచికరమైన ఫుడ్‌ను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ, కోల్‌కతా రసుగుల్లా, బెంగుళూరు మైసూర్ పాక్, లఖ్‌నవు కబాబ్, పాతఢిల్లీ బటర్ చికెన్, జయపూర ప్యాజ్ కచోరీలను కూడా దేశంలోని అనేక నగరాలకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ చేసిన మరుసటి రోజు ఆహార పదార్థాలు ఇంటికి చేరుతాయి. ల్యాబ్ పరీక్షలను కూడా నిర్వహించిన తర్వాతనే వాటిని డెలివరీ చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటు న్నారు. ఆహార పదార్థాలు చెడిపోకుండా ట్యాంపర్ ఫ్రూఫ్ కంటెయినర్లలో ప్యాకింగ్ చేయించి విమానాల్లో సురక్షితంగా తీసుకువస్తామని తెలిపారు.
మాంసాహారులే ఎక్కువ...
స్టాట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో ప్రతి వంద మందిలో 70మంది మాంసాహారులే. తెలుగురాష్ట్రాల్లో 96 శాతం మాంసాహారులే. లక్ష్యద్వీప్ వంటి ప్రాంతాల్లోని వారు 100శాతం మాంసాహారులే. తెలంగాణలో గతేడాది కంటే మాంసాహారుల సంఖ్య మరో 10 శాతం పెరిగినట్లు ఆ నివేదికలు చెప్తున్నాయి. జాతీయ సగటు కంటే ఇది సుమారు 20శాతం ఎక్కువ. వారానికోసారి తినేవాళ్లు 50శాతం ఉన్నప్పటికీ.. మెజార్టీ సందర్భాలను మాంసాహారంతోనే లాగించేస్తున్నారు.
సంతాన లేమి...
నీటి శాతం ఎక్కవగా ఉన్న ఆహారాన్ని తీసుకునే వారిలో వృషణాలు పెద్ద సైజులో ఉన్నట్లు హర్వార్డ్ వర్సిటీ సర్వేలో వెల్లడైంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారిలో 13.7మిల్లీ లీటర్ల పరిమాణం ఉన్న వృషణాలలో 167 మిలియన్ శుక్రకణాలు ఉన్నట్లు గుర్తించారు. అదే జంక్ ఫడ్ తినేవారిలో 13.1 మిల్లీ లీటర్ల పరిమాణం ఉందని, కేవలం 122 మిలియన్ శుక్రకణాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆహారపు అలవాట్లలో జంక్ ఫుడ్ తినడం తగ్గించాలని, లేని పక్షంలో సంతానలేని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కల్తీల నియంత్రణలో విఫలం
ఆహార కల్తీలను నియంత్రించచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆహార
పదార్థాలలో కల్తీతో పాటు పాల నుంచి
పండ్ల వరకు కల్తీ అవుతున్నాయి. పండ్లను
కార్బైడ్‌తో మరుగబెడుతున్నారు. కల్తీలను
కనిపెట్టేందుకు జీహెచ్‌ఎంసీ సంచార
లాబరేటరీని అందుబాటులోకి
తీసుకువచ్చింది. కానీ 25 మంది ఉండాల్సిన
ఆ ల్యాబరేటరీలో కేవలం ఐదారుగురు సిబ్బంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే
సేకరించిన నమూనాలపై నివేదికలు
ఇవ్వడంలో తీవ్రజాప్యం చేస్తున్నారనే
అపవాదు ఉంది. అలాగే జీహెచ్‌ఎంసీ
నుంచి అనుమతి ఉన్న షాపులలో మాత్రమే మాంసం కొనుగోలు చేయాలి. నాణ్యత
గురించి ఆలోచించకుండా కనిపించిన
ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి హానికరం.
సత్ఫలితాలిచ్చిన ఈట్ రైట్ నినాదం
పోషకాలు తక్కువగా ఉండి శరీరానికి హాని చేసే కొవ్వులూ, ఉప్పు, చెక్కర, చిప్స్, స్నాక్స్, మిఠాయీలు, శీతల పానీయాలు, బర్గర్లు, పిజ్జాలు నగరంలో విరివిగా లభిస్తున్నాయి. వీటి కారణంగా ఇంట్లో అమ్మ వంటల కంటే రోడ్లపై దొరికే చిరుతిండ్లకే చిన్నారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధనలను కేరళ రాష్ట్రం అత్యంత కఠినంగా అమలు చేస్తున్నది. కేరళలో ఈట్ రైట్ నినాదం మంచి ఫలితాలను ఇచ్చింది. కానీ నగరంలో టీనేజీ పిల్లలు అధికబరువుతో సతమతం అవుతున్నారు.
ఈ రుచులకే ఎక్కువ డిమాండ్
ఆన్‌లైన్‌లో ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ప్రతి వంటకం లభ్యం అవుతుంది. అయితే నగరంలో చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ తర్వాత మసాల దోశకు ఎక్కవ ఆర్డర్లు వస్తున్నాయని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇందులో ముఖ్యంగా చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీరు బట్టర్ మసాల, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్‌రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చెక్‌లకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. విదేశీ వంటకాల్లో అత్యధికంగా ఇటాలియన్, పాస్తా, పిజ్జా, మెక్సికన్ బౌల్, స్పైసీ రామెన్, సుషీ వంటకాల కోసం ఆర్డర్లు వస్తున్నాయి. అలాగే టాప్ టెన్ స్నాక్స్‌లలో సమోసా, పాప్ కార్న్, పావ్ బజ్జి, ఫ్రెంచ్‌ఫ్రైస్, క్లాసిక్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్, మింగిల్స్ బకెట్ వంటి వంటకాలు కూడా ఉన్నాయి. స్వీట్లలో గులాబ్‌జామ్, రస్మలై, చోకో లావా కేక్, రసగుల్లా, చోకోచిప్స్, ఐస్‌క్రీం, అల్పోన్సో మ్యాంగో ఐస్ క్రీం, కాజు కట్లీ, టెండర్ కోకోనట్ ఐస్ క్రీం, చాక్లెట్, హాట్ చాక్లెట్ ఫడ్జ్ ఆర్డర్‌లు ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో ఆర్డర్లలో రికార్డులు
కూకట్‌పల్లిలో ఒక వ్యక్తి ఒక యేడాదిలో 1,633 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చాడు. అంటే అతను రోజుకు సుమారు నాలుగు నుంచి ఐదు బిర్యానీలను ఆర్డర్ చేశాడు.
ముంబాయి నగరంలో ఒక వ్యక్తి యేడాదిలో సుమారు 42.3లక్షల రూపాయల విలువైన వంటకాలను ఆర్డర్ చేశాడు.
గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి రూ.6లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్ ఇచ్చి రికార్డు సృష్టించాడు.
ఆన్‌లైన్ ఫుడ్ తెచ్చుకుంటే ఇంట్లో కాలు బయట పెట్టకుండానే రాయితీలు పొందవచ్చు. హోటల్‌లో సర్వీస్ చార్జెస్, టిప్ వంటి ఖర్చులుంటాయి. కానీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు ప్రతి వంటకంపై 25 నుంచి 30 శాతం రాయితీలు ప్రకటిస్తున్నాయి.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఆఫర్స్ ద్వారా ఓ ఐటీ ఉద్యోగి యేడాదిలో రూ.5 లక్షలలు ఆదా చేశాడు.
ఆన్‌లైన్‌లోనూ స్ట్రీట్ ఫుడ్..
ఆన్‌లైన్‌లోను స్ట్రీట్ ఫుడ్‌ను విక్రయించవచ్చు. అయితే నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ ఆండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సుమారు 8లక్షల మంది ఈ సర్టిఫకెట్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు సమాచారం. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గి, జొమాటో వంటి సంస్థలతో ఒప్పదం కుదుర్చుకుని ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది.
పుట్టగొడుగుల్లా స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్
చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లీవర్ ఫ్రై, బోటి కర్రీ, బోటీఫ్రై, మటన్ కర్రీ, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ.. మీది మొత్తం థౌజండ్ అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా.. అనే డైలాగ్‌తో కుమారి ఆంటీ అనే ఓ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకురాలు ఒక్కరాత్రిలో ఫేమస్ అయ్యారు. కుమారి ఆంటీ తీరుగానే నగర శివారుతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల వెంట స్ట్రీట్ ఫుడ్ కోర్టులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
ప్రధాన కూడళ్లలో, జాతీయ రహదారుల వెంట వేల సంఖ్యలో స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు పూటకొకటి పుట్టుకొస్తున్నాయి. అయితే హోటల్ ధరలతో పోల్చితే.. ఈ సెంటర్లలో తక్కవ ధరలకే నాణ్యమైన ఆహారం అందుతుడంటంతో ప్రస్తుతం మార్కెట్‌లో స్ట్రీట్‌ఫుడ్ కోర్టులకు మంచి డిమాండ్ ఉంది. ఐటీ సంస్థలున్న ప్రాంతాల్లో రాత్రింబవళ్లు స్ట్రీట్‌ఫుడ్ కోర్టులను నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో నగరంలో 24/7 సంచార వాహనాలలోను టిఫిన్ సెంటర్లను నిర్వహిస్తున్నారు.
తాజావే తినాలి
నగరాల్లో ప్రజలు చాలా వరకు జీవం ఉన్న ఆహారపదార్థాలను తినడం లేదు. ఇప్పటికే అమ్మ వంటకాలకు దూరం అయ్యారు. క్రమంగా ఇంటి వంటకాలకు కూడా దూరం అవుతున్నారు. నిర్ణీత సమయం అనేది లేకుండా 24/7 ఎక్కడ పడితే అక్కడ హోటళ్లలో, ఆన్‌లైన్, స్ట్రీట్ ఫుడ్ కోర్టులలో తింటున్నారు. అయితే ఈ ఫుడ్ సెంటర్స్ ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తాయి అనేది చూసుకోవాలి. లేదంటే ఫుడ్‌ప్రియుల కడుపులో అలజడి షురూ అవుతుంది. క్రమంగా అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతారు.
డా.భవాని,
ప్రముఖ నేచర్ క్యూర్ వైద్యులు
జంక్‌ఫుడ్‌తో రోగాలు తప్పవు
నగరాల్లో ఎక్కువగా బిర్యానీలు, జంక్‌ఫుడ్ తింటున్నారు. యువత బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు, బేకరి ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో వండిన వంటలనే తినాలి. జంక్ ఫుడ్, హోటల్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన యూరిక్ యాసిడ్ పెరిగి భవిష్యత్తులో జీర్ణసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కోలెస్ట్రాల్, ఒబెసిటీ, గుండె జబ్బులు, బ్లడ్ ప్రెషర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ప్రభాకర్ రెడ్డి, సీనియర్ సైంటిస్ట్
(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
న్యూట్రిషన్)
బిర్యానీ కల్చర్ పెరిగింది
హైదరాబాద్ నగరంలో బిర్యానీ కల్చర్ పెరిగింది. ప్రతి ఒక్కరు బిర్యానీ, చైనీస్ ఫుడ్‌ను ఇష్టంగా తింటుతున్నారు. నాణ్యమైన బిర్యానీలను సరఫరా చేసే హోటల్స్ పాతబస్తీలో ఒకటి రెండు ఉన్నాయి. కానీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు, హోటల్స్ సర్వ్ చేస్తున్న బిర్యానీల నాణ్యతపై అనుమానాలున్నాయి. రోడ్‌సైడ్ చైనీస్ ఫుడ్ తయారీలో చాలా రకాల రసాయనాలను వాడుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు తినడం వలన పెద్దగా నష్టం ఉండదు కానీ.. క్రమం తప్పకుండా జంక్ ఫుడ్, ఫాం చికెన్ తినేవాళ్లకు ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతున్న యువత టీనేజీలోనే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. సంప్రదాయ ఆహారంతో పాటే సమతుల ఆహారం తినాలి.
డా.అంబటి సురేందర్ రాజు, ప్రముఖ హోమియో వైద్యులు
సంతోనోత్పత్తికి సమస్యగా మారింది
జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన షుగర్ లెవల్స్, హై కొలెస్ట్రాల్, ఆర్గన్ డ్యామేజ్, ఇన్సూలిన్ రిసెప్టర్స్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్న వయస్సులోనే శరీరంలో మార్పులు వస్తున్నాయి. జంక్‌ఫుడ్ సంతానోత్పత్తికి ప్రధాన సమస్యగా మారింది. ఇతర దేశాలతో పోల్చితే, భారతీయుల్లో 10 సంవత్సరాలు వయస్సు ఎక్కువగా ఉన్నట్లు కని పిస్తున్నారని ఇటీవల అంతర్జాతీ య ఆరోగ్య సంస్థ లు వెల్లడించాయి. జీవనశైలిలో మార్పుల కారణంగా క్యాన్సర్ బాధితులు పెరగి ప్రపంచ దేశాలు ఇండియాని క్యాన్సర్ హబ్‌గా పిలుస్తున్నాయి. ఇంట్లో వండిన పదార్థాలను కూడా వేడిగా ఉన్నప్పుడే తినాలి. ప్రకృతిని అనుసరంచి మనిషి జీవనశైలి మారాలి. అర్ధరాత్రుళ్ల వరకు మేల్కొ ని ఉండటం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం అనారోగ్యానికి ప్రధాన కారణం.
డాక్టర్. నాగేశ్వరి రావు,
ప్రముఖ గైనకాలజిస్ట్