23 August, 2026 | 12:40 AM

అక్రమ నిర్మాణాలపై 'హైడ్రా' హెచ్చరిక

22-08-2026 11:45 PM

గచ్చిబౌలి ఘటనపై కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు

రంగారెడ్డి,(విజయక్రాంతి): ​శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం ప్రమాదవశాత్తూ కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. సంఘటనపై హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ స్పందిస్తూ అక్రమ నిర్మాణదారులపై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ​కేవలం 50 గజాల చిన్న విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం పక్కకు ఒరిగి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవన నిర్మాణంలో పనిచేస్తున్న ఇద్దరు నిరుపేద కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా, జిహెచ్‌ఎంసి, మరియు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

​విపత్తుకు కారణమైన తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు

​ఈ ప్రమాదం కేవలం మానవ తప్పిదాల వల్లనే కాకుండా చట్టబద్ధ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టడం వల్లనే జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ​పరిమితికి మించిన నిర్మాణం: తెలంగాణ మున్సిపల్ చట్టం మరియు నేషనల్ బిల్డింగ్ కోడ్  ప్రకారం 50 గజాల స్థలంలో కేవలం జి +2అంతస్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకంగా 7 అంతస్తులు నిర్మించారు.  20 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే భవనాలకు చుట్టూ కనీసం 3 నుండి 6 మీటర్ల ఖాళీ స్థలం  వదలాలి. ఈ నిర్మాణంలో అసలు ఎలాంటి ఖాళీ స్థలం వదల్లేదు.

​నాలా బఫర్ జోన్ ఆక్రమణ: నాలా పక్కన నిబంధనల ప్రకారం ఉంచాల్సిన 2 నుండి 9 మీటర్ల బఫర్ జోన్‌ను ఆక్రమించి ఈ భవనాన్ని కట్టారు. టీజీ -బీ పాస్  ద్వారా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. మట్టి పరీక్షలు మరియు స్ట్రక్చరల్ ఇంజనీర్ సర్టిఫికేషన్ లేకుండానే నాసిరకం మెటీరియల్‌తో నిర్మాణం చేపట్టారు. కార్మికులకు ఎలాంటి సేఫ్టీ గేర్ అందించకపోగా, పక్కన ఉన్న భవనాల రక్షణకు సంబంధించి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు.

హాస్టళ్ల నిర్వాహకులపై నిఘా....

ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో 40-50 గజాల స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఐదారస్తుల భవనాల్లో అధిక భాగం కమర్షియల్ హాస్టళ్లుగా నడుస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదకర పరిస్థితిలో ఉన్న భవనాల నుంచి నివాసితులు మరియు విద్యార్థులను తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా హైడ్రా అధికారులు హెచ్చరించారు.

​కఠిన చట్టపరమైన చర్యలు....

నిర్మాణ దారులు, బిల్డర్లు మరియు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు/సహకారం అందించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. చెరువులు, నాలాల బఫర్ జోన్లు మరియు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన అక్రమ భవనాలన్నింటినీ విచక్షణ లేకుండా కూల్చివేస్తామని రంగనాథ్ తేల్చిచెప్పారు.